amaravathi farmers on Jagan: రాజధాని అమరావతిపై సీఎం జగన్, మంత్రుల వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అమరావతి రైతులు అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా ? అని వారు ప్రశ్నించారు. కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించినా.. మళ్లీ పాలనా వికేంద్రీకరణ అంటూ మెుండిగా వ్యవహరించమేంటని ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. రైతులు చేసిన త్యాగాలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారన్నారు. చట్టసభలు, కోర్టులంటే సీఎం జగన్‌కు లెక్కలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. ప్రభుత్వం మారటం లేదన్నారు.
"ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా ?. రాజీనామా చేసి అందరూ ఎన్నికలకు వెళ్లండి.. ప్రజలు ఎవరినీ ఆమోదిస్తారో తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 200 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను అవమానించేలా మంత్రులు మాట్లాడారు. వికేంద్రీకరణ గురించి ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. అమరావతిని అభివృద్ధి చేస్తే అన్ని జిల్లాలకు ప్రతిఫలాలు అందుతాయి. మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే కోర్టులో న్యాయం దక్కింది. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని నేతలకు మరి ఎలా చెప్పాలి. చట్టసభల్లో అందరి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పాలి. సీఎం జగన్ ఈసారి మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్లాలి." -అమరావతి రైతులు
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం:పాలనా వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని, రాజధానిపై నిర్ణయం తమ హక్కు అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. రాబోయే తరాల బాధ్యత కూడా తమపై ఉందని, వికేంద్రీకరణబాటలో నడవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం.. హైకోర్టు తీర్పును ప్రస్తావించినట్లు 'పీటీఐ' వార్తా కథనం వెల్లడించింది. రాజధాని విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు.. రాజ్యాంగంతోపాటు శాసనసభకు ఉన్న అధికారాలనూ ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించారు.