తెలంగాణ

telangana

ETV Bharat / state

Amara Raja unit: అమరరాజా యూనిట్‌ తమిళనాడుకు తరలింపు! - తమిళనాడులో అమరరాజా యూనిట్‌

ఏపీలోని చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ.. తమిళనాడులో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంతో కసరత్తు ముమ్మరం చేసింది. స్థలం కేటాయింపునకు సంబంధించి ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం మధ్య చర్చలు సాగినట్లు సమాచారం.

అమరరాజా యూనిట్‌
Amara Raja New Unit

By

Published : Aug 3, 2021, 8:11 AM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ.. తమిళనాడులో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంతో కసరత్తు ముమ్మరం చేసింది. స్థలం కేటాయింపునకు సంబంధించి ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. తమ సంస్థకు రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘అడ్వాన్స్‌డ్‌ లిథియం టెక్నాలజీ రీసెర్చ్‌ హబ్‌’ను తమిళనాడులో నెలకొల్పాలని సంకల్పించింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అమరరాజా సంస్థలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి.

చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమకు వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి హయాంలో కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం, కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు, పరిశ్రమల మూసివేత ఉత్తర్వులు జారీ, విద్యుత్‌ సరఫరా నిలిపివేత వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. సంస్థ హైకోర్టును ఆశ్రయించగా... విచారణ అనంతరం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఆ తర్వాత తరచూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టడం వేధింపుల్లో భాగమేనని యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల సంస్థ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరిగాయి.

పరిశ్రమల ఏర్పాటు నుంచీ.. 36 సంవత్సరాలుగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న గల్లా రామచంద్ర నాయుడు తన బాధ్యతలను వైస్‌ ఛైర్మన్‌ స్థానంలో ఉన్న కుమారుడు గల్లా జయదేవ్‌కు అప్పగిస్తూ సంస్థ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా మనవళ్లు గౌరినేని హర్షవర్ధన్‌, గౌరినేని విక్రమాదిత్యను నియమించారు. ఒకే ప్రాంతంలో పరిశ్రమలు విస్తరించడం సమంజసం కాదని భావించిన నూతన నాయకత్వం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన యూనిట్‌ను తమిళనాడు స్థాపించాలని సంకల్పించినట్లు యాజమాన్య వర్గాలు స్పష్టం చేశాయి. ఇతరత్రా పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ నుంచీ ఆహ్వానం లభించినట్లు సమాచారం. పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:GRMB, KRMB Meeting: బోర్డుల సమన్వయ కమిటీ సమావేశాలకు తెలంగాణ హాజరు అనుమానమే!

ABOUT THE AUTHOR

...view details