తెలంగాణ

telangana

ETV Bharat / state

Alternate Crops in Telangana : వర్షాభావం తప్పేలా లేదు.. మరి ఏం వేస్తే బాగుంటుంది..?

Alternate Crops For Untimely Rains : రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ అదును దాటిపోతున్నవేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వానాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వర్షాలు కురవవలేదు. ఫలితంగా పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ క్రీడా సహకారంతో వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో పంట ప్రణాళికలు, సాగు విస్తీర్ణం, విత్తన రకాలు, రసాయన ఎరువులు, పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. 22 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతున్న వేళ క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తయారు చేసి సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది.

crops
crops

By

Published : Jul 18, 2023, 6:48 AM IST

ప్రత్యామ్నాయ పంటల సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి

Alternate Crops Suggestions To Farmers : రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యం అయినప్పటికి ఆశించిన విధంగా వర్షాలు కురవపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జులై రెండో వారం చివరికి వచ్చినా వరుణుడు జాడలేక, వేసిన విత్తనాలు మొలకెత్తక పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నాం అని రైతులు వాపోతున్నారు. రైతుల సమస్యల దృష్ట్యా హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ క్రీడా సహకారంతో వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో పంట ప్రణాళికలు, సాగు విస్తీర్ణం, విత్తన రకాలు, రసాయన ఎరువులు, పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

వర్షాధార ప్రాంతాల్లో శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పత్తి, కంది, మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించింది. పంట యాజమాన్య పద్ధతుల పైనా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

Alternate Crops For Delayed Monsoons Rains: పలు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నందున ఈ నెల మూడో వారం నుంచి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ పంటలు, వాటి యాజమాన్య పద్ధతులను వ్యవసాయ వర్శిటీ వెల్లడించింది. వికారాబాద్, మేడ్చల్‌, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 541 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 426 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది.వరి సాగులో జాప్యం జరిగిన కారణంగా స్వల్పకాలిక తెలంగాణ సోనా వంగడాన్ని సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. పత్తిని ఈ నెల 20 వరకు సాగు చేసుకోవచ్చని... మరింత ఆసస్యమైతే పత్తితోపాటు అంతర పంటలను వేయాలని తెలిపారు. పత్తి, ఇతర పంటల విత్తనాలు మొలకెత్తని పక్షంలో ప్రత్యామ్నాయంగా కందులు, ఆముదం, పొద్దుతిరుగుడు, మొక్కజొన్నతో పాటు కూరగాయలు సాగు చేసుకోవచ్చని వెల్లడించింది.

జిల్లాల వారిగా ఈ పంటలు వేసుకుంటే మేలు :మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం 837 మిల్లీమీటర్లకు 650 మిల్లీమీటర్లే నమోదైంది. ఇక్కడ సైతం స్వల్పకాలిక వరి వంగడాలనే సాగు చేసుకోవాలని వ్యవసాయ వర్శిటీ చెప్పింది. పత్తితోపాటు అంతర పంటలను వేసుకోవాలని.. ఇప్పటికీ పంటలు వేయనిచోట కంది, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 857 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 667 మిల్లీమీటర్ల సగటు వర్షమే పడింది. ఈ జోన్‌లోనూ స్వల్పకాలిక వరి రకాలనే ఎంచుకొని నాట్లు వేయాలని... పత్తిలోనూ అంతర పంటలు చేపట్టాలని సూచించింది. ఇప్పటికీ పంటలు ఏమీ వేయనిచోట ప్రత్యామ్నాయంగా కంది, స్వల్పకాలిక రకం మొక్కజొన్న, కూరగాయలు, చెరకు, మినుములు, రాగులు వేయాలని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details