Telangana Annual Budget 2023-24: ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం.... మరోమారు భారీ బడ్జెట్ తీసుకొచ్చింది. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌లో... 2లక్షల 90వేల 396 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. సొంత రాబడులపైనే ఎక్కువ ఆధారపడ్డారు. సొంతపన్నులు, పన్నేతర ఆదాయం అంచనాల్లో సగానికిపైగా ఉంది. అప్పులపై కేంద్రం ఆంక్షలవేళ 2022-23 కంటే తక్కువ మొత్తాన్ని ఎఫ్ఆర్బీఎం రుణంగా ప్రతిపాదించింది. కేంద్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని... రుణాలు, గ్రాంట్లు, ఆర్థిక సంఘం - నీతి అయోగ్ సిఫారసులు, బకాయిల విషయంలో అన్యాయం చేస్తోందని ఆక్షేపించింది. కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు రాకపోయినా మరోమారు 41 వేల కోట్లు ప్రతిపాదించింది. వివిధ శాఖలకు పెంచిన నిధుల వివరాలను బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికమంత్రి హరీశ్‌రావు వివరించారు.
సంక్షేమ రంగానికి అగ్ర తాంబూలం :కేటాయింపుల్లో ఎప్పటిలాగే సంక్షేమ రంగానికి సర్కార్ పెద్దపీట వేసింది. వ్యవసాయం, నీటిపారుదలకు ప్రాధాన్యందక్కింది. పంచాయతీరాజ్, పురపాలకశాఖలకు పద్దు పెంచిన ప్రభుత్వం... స్థానిక సంస్థల నిధుల విషయంలో కీలకనిర్ణయం తీసుకొంది. చేసిన పనులకు నిధులకొరత, బిల్లులు రాకపోవడం సమస్యలతో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని... పల్లెప్రగతి, పట్టణప్రగతి నిధులను నేరుగా స్థానిక సంస్థలకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. సొంత స్థలం ఉన్నవారికి 3లక్షల ఆర్థిక సాయాన్ని నియోజకవర్గానికి 2వేల మంది చొప్పున అందించేలా నిధులు కేటాయించారు.
ఆ పథకాలకు బడ్జెట్‌లో పెద్దపీట : దళితబంధు పథకానికి 17వేల 100 కోట్లు కేటాయించారు. 118 నియోజకవర్గాల్లో 1100 మంది చొప్పున దళితబంధుకు నిధులిచ్చారు. దళితబంధు తర్వాత అత్యధిక నిధులు కేటాయించిన... రెండో పథకంగా రైతుబంధుకు 15వేల 75 కోట్లు కేటాయించింది. గతేడాది వానాకాలంలో ఆ పథకం కింద 65 లక్షల మందికి ఎకరానికి 5 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేయగా... వచ్చే వానాకాలంలో 70 లక్షల మందికిపైగా రైతులుంటారని నిధులు పెంచినట్లు తెలుస్తోంది. 6,385 కోట్లు రైతు రుణమాఫీ కోసం కేటాయించింది. ఆ సొమ్మునంతా ప్రభుత్వం బ్యాంకులకు విడుదలచేస్తే 90వేల వరకు బకాయి ఉన్న రైతులందరిపంటరుణాలు మాఫీవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.