People Journey becomes hard due to Charges Hike: సామాన్యుడు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాడు. అన్ని రకాల ధరల పెంపుతో ఎలా ప్రయాణం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్టీసీ, మెట్రోలు పలు రకాల ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశాయి. దీంతో సామాన్యుల ప్రయాణమే అగమ్యగోచరంగా మారింది.
ప్రజా రవాణా అంటే ఇష్టం లేని వారు సొంత వాహనాల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అలాంటి ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించాలంటే భయపడుతున్న పరిస్థితి. అటు పెట్రోల్, ఇటు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగడమే దీనికి కారణం. ముఖ్యంగా గత 8 ఏళ్లలో భారీగా పెరిగాయి. అయినప్పటికీ కొందరు గత్యంతరం లేక ఆ భారాన్ని భరిస్తున్నారు.
ఇక ప్రజా రవాణాపై ఆధారపడే ప్రజల పరిస్థితీ అలాగే ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ సైతం రెండు, మూడు సార్లు రవాణా ఛార్జీలు పెంచింది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. తాజాగా టోల్ గేట్ల ఛార్జీల పెంపును సైతం ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే మినీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి ఒక్కొక్కరిపై రూ.4 పెంచింది. ఇక నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ మేరకు టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటన కూడా చేసింది.
ఇక సొంత కార్లు కలిగి ప్రయాణాలు చేయాలనుకునే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజా ఛార్జీలను ఈ ఏడాది 5 శాతం పెంచింది. దీంతో మళ్లీ ప్రజలపైనే భారం పడుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి-65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం రూ.465 టోల్ చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రూ.490 చెల్లించాల్సి ఉంటుంది.