సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారీ ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. తక్కువ ఖర్చుతో రైలులో ఊరెళదామని ఆశపడితే నిరాశ తప్పదు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు మూడు రోజుల నుంచే బెర్తులు నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వెళ్లే రైళ్లలో ఇప్పటికే బెర్తులన్నీ నిండిపోయాయి.
అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో కనీసం టికెట్లు బుకింగ్ చేసుకునేందుకూ అవకాశం లేకుండా రిగ్రేట్ వస్తోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చే రైళ్లలో గోదావరి, ఫలక్నామా, చార్మినార్, శాతవాహన, ఈస్ట్ కోస్ట్, నర్సాపూర్, కృష్ణా, కోనార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వీటన్నింటిలోనూ జనవరి 10వ తేదీ నుంచి వారం రోజుల పాటు బెర్తులన్నీ ఎప్పుడో నిండిపోయాయి.
దీంతో టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు కేంద్రాలకు వచ్చే ప్రయాణికులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. విజయవాడ నుంచి పలు జిల్లాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక రైళ్ల పైనే ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే నామ మాత్రంగా కొన్ని రైళ్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించింది. ఇవి ఏ మాత్రమూ సరిపోని పరిస్థితి ఉంది.
రైళ్లో బెర్తులు లేకపోవడం.. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలను భరించలేని వారు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. పండుగకు ముందు రోజుల్లో ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా హైదరాబాద్- విజయవాడ, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వందలోపే. ఇప్పటికే మూడు సార్లు టికెట్ ఛార్జీలు పెంచినందున అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేస్తే ఎవరూ బస్సెక్కరని ఆందోళన చెందిన ఆర్టీసీ యాజమాన్యం.. ఈసారి సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు.