తెలంగాణ

telangana

ETV Bharat / state

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం - హైదరాబాద్​

తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టకుండా, ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేయాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూనే.. మరింత స్పష్టత ఇవ్వాలని కోరింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు తమ పార్టీ ముందుంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి అన్నారు. ఈ పోరాటంలో వామపక్షాలు, తెజస, ప్రజా సంఘాలు కూడా తామంతా ఉద్యమిస్తామని స్పష్టం చేశాయి.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

By

Published : Sep 17, 2019, 5:03 AM IST

Updated : Sep 17, 2019, 7:43 AM IST

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

యురేనియం తవ్వకాలు నల్లమల మీద ఎక్కుపెట్టిన తుపాకీ లాంటిదని, కచ్చితంగా దాన్ని కిందికి దించే వరకు పోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. జనసేన పార్టీ నేతృత్వలో సోమవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో "యురేనియం ఆపాలి-నల్లమలను పరిరక్షించాలి" అన్న అంశంపై నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్‌, తెజస, వామపక్షాలు, తెలంగాణ ఇంటి పార్టీ, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం ఓ సైనికుడిలా తాను కూడా అందరితో కలిసి నడుస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. చాలా మంది యువత సేవ్ నల్లమల అంటూ వారి సమయం వెచ్చించి యాక్టివిస్టులుగా మారడం ఆహ్వానించదగిన పరిణామంగా మాజీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో యురేనియం అన్వేషణకుగానీ, మైనింగ్‌కిగానీ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలతో నల్లమలలో జీవవైవిధ్యం దెబ్బతింటుందని.. తద్వారా వెలువడే అణుధార్మిక వాయువులు, వ్యర్థ్యాలు నీళ్లలో కలుషితం కావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. "యురేనియం ఇతరదేశాల్లో అయినా దొరుకుతుంది కానీ.. అడవులు దొరుకుతాయా... అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా, యథేచ్ఛగా యురేనియం తవ్వకాలు చేపట్టవచ్చని 2016లో రాష్ట్ర ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చినందునే కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రజల కనీస సౌకర్యాలు అయిన కూడు, గూడు, గుడ్డ అందించాల్సిన ప్రభుత్వాలు.. జీవవైవిధ్యానికి ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల్లో మునిగిపోయాయని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌ గౌడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం అత్యంత ప్రమాదకరమైన దాతువని.. అది భూమిలో నిక్షిప్తం అయినంత వరకు ప్రమాదం లేదన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం.. దానిని బయటికి తీస్తే తీవ్రమైన రేడియో ధార్మికత వెలువడుతుందన్నారు. ప్రభుత్వం చేసిన తీర్మానం విశ్వాసం పెంచుతుందని..ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తాము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి వెల్లడించారు.

యురేనియం తవ్వకాల సమస్య తీవ్రమైందిగా భావించి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో 20మందికిపైగా మాట్లాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. పర్యావరణ విధ్వంసానికి గురి చేసే యురేనియం తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రాష్ట్రాల్లో జరపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:యురేనియం తవ్వకాలపై "శాసనసభలో" ఏకగ్రీవ తీర్మానం

Last Updated : Sep 17, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details