తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే తప్పేంటి: కేటీఆర్‌

Budida Bikshamaiah Goud joined TRS: తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పి భాజపా నేతలు మునుగోడులో ఓట్లు అడగాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. భాజపా ఒక దుష్ట సంస్కృతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. భాజపా నాయకులు శిఖండి రాజకీయం చేస్తున్నారని... రాష్ట్రంలో ఫ్లోరోసిస్‌ సమస్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​

By

Published : Oct 20, 2022, 10:32 PM IST

Budida Bikshamaiah Goud joined TRS: ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ తెరాసలో చేరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌.. భిక్షమయ్యగౌడ్‌కు తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ భాజపాపై పలు విమర్శలు గుప్పించారు. భాజపా ఒక దుష్ట సంస్కృతికి తెరలేపిందని విమర్శించారు. ధనబలంతో మునుగోడులో గెలవాలని భాజపా కుట్ర చేస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. దేశంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు కావడంలేదని, మోదీ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈసీ, ఈడీ, సీబీఐ, ఐటీ.. వీటన్నింటినీ భాజపా అనుబంధ సంఘాలుగా కలిపేస్తే బాగుంటుందన్నారు.

ఒక సంకల్పంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ లేకుండా చేశాం. వ్యవసాయం దండగ అని కొందరు అంటే.. వ్యవసాయం పండగ అని చేసి చూపించాం. ప్రజాస్వామికంగా గెలవలేక వ్యవస్థలను అడ్డుపెట్టుకుని గెలవాలని భాజపా చూస్తోంది. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లో వచ్చిన ఫలితమే మునుగోడులో వస్తుంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం 107కు పడిపోయింది. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పి భాజపా ఓటు అడగాలి. కొవిడ్‌ టీకాను మోదీ కనిపెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనటం హాస్యాస్పదం. 2018 తర్వాత తెలంగాణలో ఫ్లోరోసిస్‌ లేకుండా పోయిందని కేంద్రమే చెప్పింది. 2014కు ముందు తెలంగాణలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉందని కేంద్రం చెప్పింది. బేరం కుదిరాకే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టుగా కాంగ్రెస్‌లో ఉండి రాజకీయం చేస్తున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తే తప్పేంటి? ప్రధాని మోదీ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేయలేదా?- మంత్రి కేటీఆర్‌

మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నల్గొండ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. బీసీ బిడ్డనైన తనను రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లో ఓడించారని గుర్తు చేశారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు తెరాస నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details