కొవిడ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కొవిడ్‌పై రకరకాల అపోహలు, అపనమ్మకాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ఈ రోజుల్లో వాటిలో వచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, గూగుల్‌లో శోధించి ఇంకొందరు సొంతంగా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరం లేకపోయినా కొందరు సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నారు. కొందరైతే స్వల్ప లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం ఒక మార్గదర్శిని(గైడ్)ని రూపొందించింది. ఆసుపత్రి ఛైర్మన్ డా. డి.నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్.. డా.జి.వి.రావు దీనిని విడుదల చేశారు.
పరీక్ష.. ఐసొలేషన్, చికిత్స
*జ్వరం
*దగ్గు
*ఆయాసం
*ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
*చలి జ్వరం
*తలనొప్పి, గొంతు నొప్పి
*వాసన, రుచి కోల్పోవటం
*ముక్కు దిబ్బడ, ముక్కు కారడం
*వాంతులు, విరేచనాలు
*ఇందులో ఒకటి లేదా అంతకుమించిన లక్షణాలు ఉంటే కొవిడ్‌గా అనుమానించాలి. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి, ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. పాజిటివ్‌గా తేలితే చికిత్స ప్రారంభించాలి.
నిర్ధారణ ఇలా..
*ఆర్టీపీసీఆర్ సరైన కొలమానం పరీక్ష
*ఆర్టీపీసీఆర్ అందుబాటులో లేని, పరీక్ష ఫలితాలు ఆలస్యమైన సందర్భాల్లో సీటీస్కాన్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
*ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలో కచ్చితత్వం తక్కువ. నెగెటివ్ వచ్చినా ధీమా పనికిరాదు. ఆర్టీసీఆర్ తప్పనిసరి.
*ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే వ్యాధి నిర్ధారణ అయినట్లే.
కొరాడ్ స్కోర్ అంటే...
సీటీస్కాన్ అనగానే కొరాడ్ స్కోర్ ఎంత అనేది ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. నిజానికి కొరాడ్ స్కోర్ అంటే కేవలం నిర్ధారణ పరీక్ష మాత్రమే. అది కొవిడ్ తీవ్రత తెలిపేది కాదు. ఈ స్కోర్ ఎంత ఉంటే కొవిడ్‌గా నిర్ధారించాలి అనేది కీలకం.
వ్యాక్సిన్ మాత్రమే రక్ష...
*వ్యాక్సిన్ మాత్రమే కొవిడ్ నుంచి రక్షణ ఇస్తుంది.
*కొవిడ్ నుంచి కోలుకున్న వారు కనీసం 28 రోజుల దాటిన తర్వాతనే టీకా తీసుకోవాలి.
*మొదటి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడితే మళ్లీ మొదటి డోసు అవసరం లేదు.
*కోలుకున్నాక.. కొవాగ్జిన్ అయితే 30 రోజుల తర్వాత, కొవిషీల్డ్ అయితే 50 రోజుల తర్వాత నేరుగా రెండో డోసు తీసుకోవచ్చు.
*టీకా కారణంగా కరోనా వస్తుందనేది అపోహే.
*వ్యాక్సిన్ ద్వారా అచేతనమైన(ఇన్‌యాక్టివ్) వైరస్ లేదా వైరల్ వెక్టర్ అందిస్తారు. ఈ రెండు వైరస్‌లూ అచేతన స్థితిలో ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ కారణంగా కరోనా వచ్చే అవకాశమే లేదు.
స్వల్ప లక్షణాలుంటే..
*కొవిడ్ నిర్ధారణ అయినా ఆందోళన అవసరం లేదు. స్వల్ప(మైల్డ్) లక్షణాలు ఉంటే ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకోవచ్చు.
*అలాంటి వాళ్లు కరోనా తీవ్రతపై స్వీయ మదింపు చేసుకోవాలి.
*తీవ్ర నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జ్వరం, డయేరియా, శరీరంపై దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
*ఈ సమయంలో థర్మామీటర్, పల్స్‌ఆక్సిమీటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్(ఐచ్ఛికం), బ్లడ్ గ్లూకోజ్ మానిటర్(మధుమేహం రోగులకు), ఎన్95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.
*ప్రతి 8 గంటలకు ఒకసారి జ్వరం చూసుకుంటూ నమోదు చేసుకోవాలి.
*ప్రతి 4 గంటలకు ఒకసారి ఆక్సిజన్ స్థాయిలను నమోదు చేయాలి.
*ప్రతి రోజూ రక్తపోటు నమోదు తప్పనిసరి
*రెండు రోజులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నమోదు చేయాలి
ప్రాథమిక వైద్యమిలా..
*పారాసెటమాల్ 650 ఎంజీ
*ఇన్‌హేలర్(వైద్యుల సూచనతో)
*అప్‌రైజ్ డి-3, 60కె(విటమిన్ డి)
*విటమిన్ సి(1 గ్రాము)
*జ్వరం ఉంటే ప్రతి 6-8 గంటలకు పారాసెటమాల్ వాడాలి.
*వైద్యుల సూచనలతో పరీక్షలు తప్పనిసరి.