AICC focus on Unhappy leaders in Telangana: రాష్ట్ర కాంగ్రెస్‌లో జంబో కమిటీల ప్రకటనతో మొదలైన అసంతృప్తి రెండు గ్రూపులుగా తయారయ్యేందుకు దారి తీసింది. పీసీసీ, సీఎల్పీ రెండు వర్గాలుగా పార్టీ నిట్టనిలువునా చీలింది. బయట పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకు పార్టీ పదవులు ఎక్కువ దక్కాయని, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా జెండా మోసిన వాళ్లకి అన్యాయం జరిగిందని అసంతృప్తుల వర్గం ఆరోపణలు చేసింది.
AICC focus on Disgruntled Congress Leaders in Telangana : అసంతృప్తుల వర్గం చేసిన విమర్శలపై రేవంత్ వర్గం ఎదురుదాడికి దిగింది. పార్టీకి తీవ్ర నష్టం జరిగే రీతిలో వ్యాఖ్యలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు సేవ్ కాంగ్రెస్ అన్న నినాదం గుర్తు లేదా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకు అనుకూలంగా పని చేస్తున్నా ఎందుకు ఆయన వైఖరిని ప్రశ్నించలేదని నిలదీశారు.
విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ రెండు గ్రూపులు పోటీ పడుతున్నాయి. తాము లేవనెత్తిన అంశాలపై అధిష్ఠానం పిలిచి మాట్లాడుతుందని భావించిన అసంతృప్తి నాయకుల ఆశలు అడియాశలు అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం.. బుజ్జగించేందుకు చొరవ చూపడం లేదు. ఇప్పటివరకు ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకోలేదు.