తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Budget 2022: రాష్ట్ర బడ్జెట్​ కసరత్తు వేగవంతం.. దళితబంధుకు రూ. 20 వేల కోట్లు? - dalit bandhu news

Telangana Budget 2022: పన్ను ఆదాయం అంచనాలను చేరుకుంటున్న వేళ... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్ భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు పన్ను అంచనాలను 70 శాతం చేరుకొంది. ఈ ఏడాది లక్షా 50 వేల కోట్ల వ్యయం చేస్తామంటోన్న ప్రభుత్వం... వచ్చే ఏడాదికి మరో 30 వేల కోట్లు పెరుగుతుందని చెబుతోంది. సంక్షేమానికి సింహభాగం కేటాయింపులతో పాటు వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత దక్కనుంది. దళితబంధు పథకానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది.

telangana budget 2022
telangana budget 2022

By

Published : Feb 3, 2022, 5:30 AM IST

Telangana Budget 2022: కేంద్ర వార్షిక బడ్జెట్‌ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి దాదాపుగా స్పష్టత వచ్చింది. పనుల్లో వాటాగా 17 వేల 615 కోట్లు, స్థానిక సంస్థలకు 2,500 కోట్లు, విపత్తు నిర్వహణ నిధి కింద రూ.599 కోట్లతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఇతర నిధులు రానున్నాయి. కేంద్ర నిధులకు సంబంధించిన స్పష్టత వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ కసరత్తు కూడా ఇక వేగవంతం కానుంది.

సంక్షేమానికే పెద్దపీట..

2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ గత నెలలోనే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకొంది. వాటిని క్రోడీకరించి తదుపరి కసరత్తు కొనసాగిస్తున్నారు. శాఖల వారీగా ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. గత బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన, వచ్చే ఆర్థిక సంవత్సరం అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా సంక్షేమ రంగానికి మరోసారి పెద్దపీట వేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధి, వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు దళితబంధు పథకానికి బడ్జెట్‌లో సింహభాగం నిధులు దక్కే అవకాశం కనిపిస్తోంది. రానున్న బడ్జెట్‌లో దళితబంధుకు 20 వేల కోట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. సంక్షేమంతో పాటు వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్య శాఖలకు కేటాయింపులు అధికంగా ఉండనున్నాయి. మౌళిక వసతులు, గ్రామీణ, పట్టణాభివృద్ధికీ నిధులు బాగానే కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.

రాబడి అంచనాల్లో 70 శాతం..

డిసెంబర్ నెలాఖరు వరకు పన్నుల రాబడి బడ్జెట్ అంచనాల్లో 70 శాతం సమకూరింది. లక్షా ఆరు వేల 900 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వస్తాయని అంచనా వేస్తే... తొమ్మిది నెలల్లో 74 వేల 496 కోట్లు వచ్చాయి. జీఎస్టీ ద్వారా 23 వేల 413 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 8 వేల 288 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా రూ.19 వేల 875 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.13 వేల 40 కోట్లు రాగా కేంద్రం నుంచి పనుల్లో వాటాగా 6 వేల 236 కోట్లు వచ్చాయి. గ్రాంట్ల ద్వారా రూ.6,373 కోట్లు, 5,181 కోట్లు పన్నేతర రాబడిగా సమకూరింది.

సొంత రాబడిపై ధీమా..

బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.45 వేల 559 కోట్ల రుణాలకు గాను డిసెంబర్ వరకు 39 వేల 105 కోట్లు అప్పుగా సమకూర్చుకున్నారు. అన్ని రకాలుగా డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 25 వేల 157 కోట్లు రాగా.. లక్షా 21 వేల 90 కోట్లు ఖర్చు చేసింది. అందులో రెవెన్యూ వ్యయం 98 వేల 765 కోట్లు, పెట్టుబడి వ్యయం 22 వేల 325 కోట్ల రూపాయలు ఉంది. సొంత రాబడులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ధీమాగా కనిపిస్తోంది. డిసెంబర్ వరకు రాష్ట్రంలో పన్నుల రాబడి 70 శాతం అంచనాలను అందుకొంది. చివరి త్రైమాసికంలో అంచనాలను పూర్తిస్థాయిలో చేరుకుంటుందని సర్కార్ విశ్వాసంగా ఉంది. జీఎస్టీ ఆదాయంతో పాటు అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. భూముల మార్కెట్ ధరలు మరోసారి పెంచడంతో ఖజానాకు ఆదాయం ఇంకా పెరగనుంది.

ప్రస్తుత ఏడాది అంచనాలను చేరుకుంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనాలను భారీగానే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే వ్యయం లక్షన్నర కోట్లు దాటుతుందన్న సీఎం కేసీఆర్​.. వచ్చే ఏడాది మరో 30 వేల కోట్లు పెరిగి లక్షా 80 వేల కోట్లను దాటుతుందని ఇప్పటికే తెలిపారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ అంచనాలు బాగానే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జీఎస్​డీపీ (GSDP) వృద్ధిరేటులో పెరుగుదల దృష్ట్యా బహిరంగ రుణాల మొత్తం కూడా పెరగనుంది.

మరోసారి భారీ బడ్టెట్​..

తాజా కేంద్ర పద్దులో ప్రకటించిన విధంగా.. కేంద్రం వడ్డీ లేకుండా ఇచ్చే లక్ష కోట్ల రుణంలో రాష్ట్రానికి 3 వేల కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. పన్నేతర ఆదాయంలో భాగంగా హైదరాబాద్ పరిసరాల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తోంది. హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ ద్వారా ఇప్పటికే నిర్వహించిన ఒకదఫా వేలంలో మంచి ధర పలికి సర్కారుకు బాగానే ఆదాయం సమకూరింది. మిగతా భూముల వేలం వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. దీంతో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీ బడ్జెట్‌నే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details