Hariharakrishna in Police Custody: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిహరను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని ఎస్వోటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈనెల 9వరకు హరిహరను ప్రశ్నించనున్నారు.
నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా ? లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత చాలాసేపు ఘటనా స్థలంలోనే ఉన్న హరిహరకృష్ణ అనంతరం ఆధారాలు చెరిపివేశాడు. హత్య చేసిన తర్వాత నవీన్ చరవాణిని ధ్వంసం చేసి బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న చెట్లపొదల్లో పడేశాడు. నవీన్ చరవాణిని రికవరీచేయడంతో పాటు, హరిహరను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు. హత్య ఒక్కడే చేశాడా.. ఎవరన్న సహకరించారా.. అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. హరిహరకృష్ణతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించనున్నారు.
తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని హరిహరకృష్ణ నవీన్‌పై పగ పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడని వివరించారు. ఇందుకోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించాడని తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్లో కత్తి కొనుగోలు చేశాడని వివరించారు. గత నెల 17న హరిహరకృష్ణ, నవీన్ ఓఆర్ఆర్ సమీపంలో మద్యం తాగారని తెలిపారు.