తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు కోసం... బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వని ఆసాములు - telangana news

ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వని రైతులకు రైతుబంధు సొమ్ము జమచేయలేదని వ్యవసాయశాఖ తెలిపింది. ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈఓలకు ఇస్తే నగదు జమచేస్తామని వ్యవసాయ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒకరికి గరిష్ఠంగా 54 ఎకరాల వరకూ భూమి ఉండవచ్చనే నిబంధన మేరకు రైతుబంధు నగదును జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

rythu bandhu, rythu bandhu scheme
రైతుబంధు, రైతు బంధు నగదు

By

Published : Jun 27, 2021, 7:27 AM IST

రాష్ట్రంలో 2 లక్షల 41 వేల 905 మంది భూ యజమానులు రైతుబంధు సొమ్ము తీసుకోలేదు. వీరు తమ ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ)కు అందజేయకపోవడం వల్ల సొమ్ము జమచేయలేదని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ రైతులంతా 5 నుంచి 10 ఎకరాలకుపైగా భూమి ఉన్నవారేనని తెలుస్తోంది. వీరి వివరాలను, వీరి పేరుతో ఎంత భూమి ఉందనే లెక్కలను ఈ శాఖ అధికారికంగా వెల్లడించలేదు. ఆయా భూ యజమానులు.. ఇతర ప్రాంతాలు లేక విదేశాల్లో నివసిస్తుండడం, నగదు తీసుకోవాలనుకోకపోవడం లేక ఇతరత్రా కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరు ఖాతా వివరాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా సొమ్ము మిగిలిందని అనధికార సమాచారం. ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈఓలకు ఇస్తే రైతుబంధు జమచేస్తామని వ్యవసాయ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు.

ధరణి పోర్టల్‌లో నమోదైన 63,25,695 మంది భూ యజమానుల వివరాలను రెవెన్యూశాఖ ఈ నెల 12న వ్యవసాయశాఖకు ఇచ్చింది. గత 10 రోజుల్లో ఇందులో 60,83,790 మంది ఖాతాల్లో రూ.7,360.41 కోట్ల రైతుబంధు సొమ్మును వ్యవసాయశాఖ జమచేసింది. చివరిగా ఈ నెల 25న 54 ఎకరాల వరకూ భూమి కలిగిన 8,817 మంది ఖాతాల్లో సొమ్ము వేసింది. రాష్ట్రంలో ఒకరికి గరిష్ఠంగా 54 ఎకరాల వరకూ భూమి ఉండవచ్చనే నిబంధన మేరకు రైతుబంధు నగదు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు ఇచ్చిన రైతుబంధు సొమ్ము రూ. 600 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details