ధరణి పోర్టల్ (Dharani Portal) అమలులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు సాగుతోంది. ఆ దిశగా ఇప్పటికే వివిధ మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా... వాటి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. అయినా ఇంకాకొన్ని సమస్యలు రైతులకు (Farmers) ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యేకించి పేర్లలో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత అంశాలు సమస్యలుగా మారాయి. వాటి పరిష్కారంపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish rao) నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం... ముమ్మర కసరత్తు చేస్తోంది. పలు సమస్యల పరిష్కారం దిశగా... తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించింది. అందుకు అవసరమైన మాడ్యూల్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అవి అందుబాటులోకి వస్తే... చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు.
మాడ్యుల్స్‌పై అవగాహన...
ఇదే సమయంలో మాడ్యూల్స్‌పై మరింత అవగాహన కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావట్లేదన్న అభిప్రాయం... భేటీలో వ్యక్తం కావడం వల్ల ధరణి మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒకరోజు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించాలని మంత్రులు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో ధరణి (Dharani Portal) హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని... వివిధ అంశాలపై అవగాహన కల్పించి... దరఖాస్తులను అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండాలని సూచించారు. ఆయా సమస్యలకు అనుగుణంగా టెక్నికల్ మాడ్యూల్స్ వెంటనే రూపొందించాలని, మిగతా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.