వస్తు సేవల పన్ను తరువాత రాష్ట్ర ఖజానాను నింపేది ఆబ్కారీ శాఖ. ఈ శాఖ ద్వారా 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ. 21వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. 2019-20లో అంతకు మించిన ఆదాయం కోసం నూతన మద్యం విధానాలను రూపొందించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మందుబాబుల ఆగడాలతో ఇబ్బందులు..
దుకాణాల వద్దనే మందుబాబులు మద్యం సేవించేందుకు వీలుగా... పర్మిట్ గదులు ఏర్పాటు చేసుకోడానికి ఆబ్కారీ శాఖ ప్రత్యేక అనుమతులిచ్చింది. లైసెన్స్‌దారులు నిర్ధేశించిన ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం గదులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడే తాగేస్తున్నారు. మత్తులో వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు గురవుతున్నారు. దుకాణాల వద్దనే తాగేందుకు అనుమతి ఇవ్వడం వల్ల మద్యం ప్రియుల ఆగడాలు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. మహిళలు, పిల్లలు ఆ ప్రాంతంలో సంచరించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.
అనుమతి నిరాకరణ..
ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త మద్యం విధానాల రూపకల్పనలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు ఏమిటన్న అంశంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారిస్తోంది. పర్మిట్ గదుల ఏర్పాటుకు అనుమతించకుండా ఉండటమే గాక దుకాణాల్లో విడి విక్రయాలు చేయకుండా చూడాలని యోచిస్తోంది.