తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తుల నమోదులో ఆధార్ సంఖ్యే కీలకం - dharani portal registration news

ఆస్తుల నమోదు ప్రక్రియలో ఆధార్‌ సమర్పించని యజమానులు లెక్కల్లోకి చేరట్లేదు. . క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్న సిబ్బంది ఈ కారణంగా ఆ ఆస్తిని 'ధరణి పోర్టల్​'లో చేర్చకుండా వదిలేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ దస్త్రాలు, ఇంటి పన్ను, విద్యుత్తు, నల్లా పన్నుల రసీదులు ఉన్నా.. ఆధార్‌ కార్డు మాత్రం లేకపోవడంతో యాప్‌లో ఆస్తులు నమోదు కావడంలేదు.

Aadhaar number has become crucial in asset registration
ఆస్తుల నమోదులో కీలకంగా మారిన ఆధార్ సంఖ్య

By

Published : Oct 10, 2020, 7:41 AM IST

ఆస్తుల నమోదు ప్రక్రియలో ఆధార్‌ సమర్పించని యజమానులు లెక్కల్లోకి చేరడం లేదు. విశిష్ట సంఖ్యను యాప్‌లో నమోదు చేయకపోతే ఆస్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ సహకరించడం లేదు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్న సిబ్బంది ఈ కారణంగా ఆ ఆస్తిని ‘ధరణి’లో చేర్చకుండా వదిలేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీ రికార్డు (ఎన్‌ఏజీపీఆర్‌) రూపొందించేందుకు పక్షం రోజులుగా పురపాలక, పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో ఏళ్లుగా ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ దస్త్రాలు, ఇంటి పన్ను, విద్యుత్తు, నల్లా పన్నుల రసీదులు ఉన్నా.. ఆధార్‌ కార్డు మాత్రం లేకపోవడంతో యాప్‌లో ఆస్తులు నమోదు కావడంలేదు. ఈ తరహా సమస్యలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఉప్పల్‌, మాదాపూర్‌.. ఖమ్మం, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, కరీంనగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన వారు రాజధాని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. కానీ వారు ఇప్పటివరకు ఆధార్‌ విశిష్ట సంఖ్యను తీసుకోలేదు. వీటి నమోదుకు సిబ్బంది వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు, బంధువులు, అద్దెకు ఉన్నవారు ఎదురవుతున్నారు.

ఇంకా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారాల్లో స్థిరపడిన చాలామందికి ఆధార్‌కార్డులు లేనట్లు గుర్తిస్తున్నారు. కొంతకాలం కిందట ఇక్కడ నివసించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన చాలామంది ఆధార్‌లో చిరునామాలు మార్చుకున్నారు. ఇప్పుడు ఆస్తుల నమోదులో ఆ చిరునామాను సిబ్బంది తిరస్కరిస్తున్నారని భవనాల్లో నివసిస్తున్న వారు చెబుతున్నారు. యాప్‌లో నమోదుకు ఆస్తికి సంబంధించిన యజమాని ఆధార్‌ నంబరు తప్పనిసరిగా సమర్పించాలని, దాన్ని తీసుకుని సమీప స్థానిక సంస్థల కార్యాలయాన్ని సంప్రదించాలని ఆస్తులకు రక్షణగా ఉన్నవారికి సిబ్బంది సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర ఆధారాలేవైనా సమర్పించేందుకు అనుమతివ్వాలని ఆస్తుల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: పంట కోతలకు ఇక్కట్లు.. రైతులకు భారంగా మారనున్న ఖర్చులు

ABOUT THE AUTHOR

...view details