తెలంగాణలో నమోజ్యోతి కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు ఉత్సాహాంగా జరిపారు. పలువురు కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరీంనగర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నమోజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో కార్యకర్తలు మోడీకి అండగా నిలవాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో మోదీ దేశ ప్రధానిగా ఉండటం ప్రజల అదృష్టం అని కొనియాడారు. కరోనాపై యుద్ధంలో మోదీ దేశానికి కొండంత అండ అని తెలిపారు.
ప్యాకేజితో రాష్ట్రంలో..
మోదీ ప్రకటించిన ప్యాకేజితో రాష్ట్రంలో 59 లక్షల మంది జాబ్ కార్డుదారులకు ఉపాధి, ఉజ్వల గ్యాస్ 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు, 5.5 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్థులకు, 50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. అవి లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఆపద సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలు కూడా పార్టీలకు, కులాలకు అతీతంగా ఒకరికొకరు అండగా నిలవాలన్నారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యత అని సూచించారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.