మహానగర జలాశయాలు రసాయన కారాగారాలుగా మారుతున్నాయి. మురుగుతోపాటు రసాయన వ్యర్థాలు, చెత్తా, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను చెరువుల్లోనే పడేస్తుండడం వల్ల మినీ డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. దీనికితోడు పారిశ్రామిక వ్యర్థాలు తోడవ్వడంతో చెరువుల్లోని జలచరాలకు ఆక్సిజన్ అందని పరిస్థితి నెలకొంది.
కబ్జాలే ప్రధాన సమస్య...
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే సీవేజ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రశాంత్‌నగర్‌లోని ఖాజాకుంటలో ఈ తరహా సీవేజ్ ప్లాంట్‌ను నిర్మించారు. అంబీర్ చెరువులోని ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నాలాను నిర్మించారు. అది తాత్కాలికమే అని అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడి ఆర్‌సీసీ నిర్మాణం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక్కడ నిర్మించే వాకింగ్ ట్రాక్ రిటైనింగ్ వాల్‌ను బఫర్‌జోన్‌లో కాకుండా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. నగరంలోని పటేల్‌కుంట చెరువు, గంగారం చెరువు, సున్నం చెరువు, హస్మత్ చెరువు, కాముని చెరువుల్లోనూ దాదాపూ ఇదే పరిస్థితి. డ్రైనేజీ లైన్లను పూర్తిగా ఈ చెరువుల్లోకే వదిలేస్తున్నారు. ఎల్లమ్మ చెరువు 18 ఎకరాల వరకు కబ్జా అయినట్లు పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
చెరువు మొత్తం వ్యర్థాలతో నిండిపోవడంతో రసాయన నురగలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నగరంలోని రంగథాం చెరువు, నెక్నాంపూర్ చెరువు, లింగంపల్లిలోని చాకలివాని చెరువుల్లో, మియాపూర్ పెద్ద చెరువులు పూర్తిగా కలుషితమైపోయి రసాయన నురగలు వెలువడుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
మురుగును వదిలేసి... సుందరీకరణ