కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని మాత్రమే ఈ సీజన్ నుంచి అమలు చేస్తోంది. అదీ పత్తి, మిరప పంటలకే. ప్రస్తుతం వాటికీ పరిహారం దక్కేట్టు లేదు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ, కుండపోత వర్షాలకు రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇప్పటికే 20 వేల ఎకరాలకు పైగా నీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఈ కంపెనీ అమలు చేసేది వాతావరణ ఆధారిత బీమా.
అంటే పంట ఎంత దెబ్బతిన్నదనే వివరాలను పొలాలకెళ్లి చూడకుండానే పరిహారం ఖరారు చేస్తుంది. పంట వేసిన ప్రాంతంలో వర్షాలు ఎలా ఉన్నాయనే లెక్కలను వాతావరణ శాఖ నుంచి కంపెనీ తీసుకుంటుంది. గత ఏడాది సాధారణ వర్షపాతంతో పోల్చుతుంది. ఎక్కువ కురిస్తే అతివృష్టి, తక్కువ కురిస్తే అనావృష్టని నిర్ధరించడానికి ఉండాల్సిన వర్షపాతం శాతాలను నిర్దేశిస్తుంది. అంతకంటే ఎక్కువ/తక్కువ కురిస్తే పరిహారం లభిస్తుంది.
మతలబు అంతా తేదీల్లోనే...
బీమా కంపెనీ వర్షపాతాన్ని లెక్కించేందుకు నిర్ణయించిన తేదీలు రైతులకు పరిహారాన్ని అందించేలా లేవు. నిబంధనల్లో పత్తి ఉన్న ప్రాంతంలో సాధారణం కన్నా వర్షం తక్కువగా కురిసే తేదీలను ఈ నెల 15 నుంచి నవంబరు 15గా నిర్ణయించింది. మిరపకు అక్టోబరు 15 వరకూ గడువు పెట్టింది. సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే తేదీలను పత్తికి సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 31 దాకా, మిరపకు వచ్చే నెల 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
కానీ గత 2 నెలలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో సాధారణం కన్నా చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఉదాహరణకు పత్తి అధికంగా సాగు చేసే జోగులాంబ గద్వాల జిల్లాలో జూన్ 1 నుంచి ఆదివారానికి సాధారణ వర్షపాతం 279.8 మి.మీ.కు గాను 602.3 మి.మీ.(115 శాతం అదనం) కురిసింది. పంటలబీమా లెక్కల ప్రకారం పంట వేసిన ప్రాంతంలో సాధారణం కన్నా 50 శాతం అదనంగా కురిస్తే బీమా పరిహారం భారీగా వస్తుంది. ఈ బీమా కంపెనీ ఆగస్టు 1 నుంచి కురిసే అధిక వర్షాలనే పరిగణనలోకి తీసుకుంటామనే మెలిక పెట్టడంతో వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చే అవకాశం లేదు.
ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్‌బాగ్ నిరసనకారుడు అలీ