రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటిని అందించడమే సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్.. 53వ వార్షిక సమావేశాన్ని జలమండలి ఎండీ దాన కిషోర్‌తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేస్తుందని పోచారం తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలోని ప్రతీ ఇంటికి నెలకు ఇరవై వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల నిర్మాణం, అమలు విజయవంతంగా నడుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
దేశంలోని వివిధ పట్టణాల్లో 33 శాతం నీరు వృథాగా పోతుందని జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. వృథా నీటిని తగ్గించి నీటి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మన దేశంలో తలసరి నీటి లభ్యత తక్కువగా ఉందనీ.. ఈ తరుణంలో వృథాగా పోతున్న మురుగు నీటిని శుద్ధి చేసి, పునర్వినియోగించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగుని శుద్ధి చేసి మానవేతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా.. జలమండలి ఆధ్వర్యంలో 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ)నిర్మించ తలపెట్టామని దాన కిషోర్ వెల్లడించారు. ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డా.ఎమ్.సత్యనారాయణ(జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ), ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొండారెడ్డి(జలమండలి మాజీ డైరెక్టర్)లను ఆయన అభినందించారు.
ఇదీ చూడండి :కొత్తగా 375 జంబో బ్యాలెట్ బాక్సులు