తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనంత'లో మృత్యుఘోష.. ఆక్సిజన్ అందక నలుగురు మృతి!

ఏపీలోని అనంతపురం జిల్లాలో క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక నలుగురు కరోనా రోగులు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలు తలెత్తడమే రోగుల మరణానికి కారణమని తెలుస్తోంది. జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇలాంటివి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా అంతటా భయందోళనలు నెలకొన్నాయి.

4-covid-patients-died-due-to-snag-in-oxygen-supply-in-anantapur
'అనంత'లో మృత్యుఘోష.. ఆక్సిజన్ అందక నలుగురు మృతి!

By

Published : May 5, 2021, 9:39 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులకు సూచించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్‌ కొరత ఉందని తెలిసినా దాన్ని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సకాలంలో ప్రాణవాయువు అంది ఉంటే తమవారు బతికేవారని బోరున విలపించారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది ఉరుకుల పరుగుల మీద సరిచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. 50 మంది రోగులకు ఒక నర్సు ఉన్నారని, దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పడుతోందంటున్నారు. ఒక వ్యక్తి 50 మందికి ఎలా సేవలు అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

సరఫరాలో లోపమే కారణం

ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హుటాహుటినా క్యాన్సర్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహలను పరిశీలించి బంధువులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్‌ సరఫరాలో లోపం కారణంగానే నలుగురు మృతి చెందారని ఆయన ధ్రువీకరించారు. కరోనా రోగుల బంధువులు ఇష్టారీతినా ఆక్సిజన్‌ సిలిండర్లను ఆపరేట్‌ చేస్తున్నారని దీనివల్ల మిగతా వారికి ప్రెజర్‌ తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఘటనపై అధికారిక ప్రకటన చేయాల్సిన జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు మీడియాతో మాట్లడకుండానే వెళ్లిపోయారు. తర్వాత రాత్రి 11 గంటల సమయంలో క్యాన్సర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు, ఆక్సిజన్‌ ప్లాంటు నిర్వహకులు వారసి ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

సర్వజనలో 15 మంది

అనంతపురం జిల్లాలో ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు చనిపోతున్న ఘటనలు వరసగా చోటుచేసుకుంటుండటం ప్రజలను భయందోళనలకు గురిచేస్తోంది. ఈనెల ఒకటో తేదీన జిల్లా కేంద్రంలోని సర్వజనలో 15 మంది చనిపోయారు. వీరి మరణానికి ఆక్సిజన్‌ సరఫరాలో లోపమే కారణమని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. 3వ తేదీన హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా జిల్లా కేంద్రంలోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో ప్రాణవాయువు సరఫరాలో లోపం కారణంగా నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. మృతుల లెక్కలకు సంబంధించి కూడా తప్పుడు లెక్కలు చూపుతున్నారని విమర్శిస్తున్నారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదని.. దీంతో పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరస ఘటనల నేపథ్యంలో జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్లు, సరఫరాలో లోపాలను వెంటనే సరిచేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వీటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్లకు ప్రాణవాయువును పంపిణీ చేసే ఏజెన్సీలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details