కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణి ప్రణాళికలో కీలకమైన కాళేశ్వర ప్రాజెక్టు ఫలితాలు ఇప్పటికే అందుతున్నాయి. దశల వారీగా ప్రాజెక్టును పూర్తిచేసి పూర్తిస్థాయి ఫలాలు అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడాది పొడవునా గోదావరి నది దాదాపు 150 కిలోమీటర్ల మేర సజీవంగా ఉండనుంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలు, కాల్వల పరిసరాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం సహా ఇతర పుణ్య క్షేత్రాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలన్నింటిని ఉపయోగించుకుని అనుకూలతలను సద్వినీయోగం చేసుకుని పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
పర్యటక ప్రాంతంగా అభివృద్ధి..
సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి పారుదల, పర్యటక శాఖల అధికారులతో పాటు ఆర్కిటెక్టులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నమూనాలను తయారు చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. గోదావరి నది తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో గోదావరి పర్యటక సర్క్యూట్ ప్రాజెక్టును చేపట్టింది. సర్క్యూట్ కోసం రూ. 300 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది.