నకిలీ పత్రాలతో రూ.2 కోట్ల విలువైన ఫెరారీ కారును కాజేయాలనుకున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన జెస్సిక్ వద్ద దివేశ్ గాంధీ ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. తన పేరిట కారును రిజిస్ట్రేషన్ చేయించుకురమ్మని నీరజ్ శర్మ అనే బ్రోకర్‌కు కారు పత్రాలు అందజేశారు. ఎలాగైనా కారును సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి బ్రోకరే తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.
ఫెరారీ కారు కాజేసేందుకు ప్లాన్.. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
నకిలీ పత్రాలతో విలువైన కారును కాజేయాలని చూసిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. ఖరీదైన కారు కొన్న యజమాని పేరు మీద రిజస్ట్రేషన్ చేయాలని ఇచ్చిన పత్రాలను తమపేరుమీద రిజిస్టర్ చేయించుకున్నారు.
దివేశ్ గాంధీ అమెరికాకు వెళ్లిపోవటం వల్ల... కొన్ని రోజుల తర్వాత కారు రిజిస్ట్రేషన్ గురించి అడగ్గా నీరజ్ శర్మ బుకాయించాడు. కారు తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నానని కారును తనకు ఇచ్చేయాలని నీరజ్ శర్మ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని దివేశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీరజ్ శర్మ కుట్రపూరితంగా వ్యవహరించి అక్రమంగా కారును తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కారు మాత్రం దివేశ్ గాంధీ వద్దనే ఉందని తెలిపారు. ఈ ముఠాలో సభ్యులుగా ఉన్న దిల్లీకి చెందిన భూపేందర్, సద్దాం, నీరజ్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తయిన అనంతరం మరికొంత మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ మధుకర్ స్వామి తెలిపారు.