తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు - coronavirus india

రాష్ట్రంలో క్రమంగా కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం 169 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. స్థానికంగా నివసించే వారిలో 100 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా... విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి వైరస్‌సోకినట్లు తేలింది. మహమ్మారి కాటుకు మరో నలుగురు చనిపోగా... మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 71కు చేరుకుంది.

169-new-corona-positive-cases-reported-in-telangana
తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

By

Published : May 30, 2020, 7:35 AM IST

రాష్ట్రంలో శుక్రవారం మరో 169.. కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రవాసుల్లో 100 మందికి నిర్ధారించగా... సౌదీనుంచి వచ్చిన 64 మందికి....ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వలస కూలీల్లో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయ్యిందని వైద్యాఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో నలుగురు మృతిచెందగా వైరస్‌ మృతుల సంఖ్య 71కు చేరింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో శుక్రవారం నాటి ఫలితాలే అత్యధికం. జీహెచ్​ఎంసీ పరిధిలో ఒక్కరోజే 82 కేసులు నిర్థారణకావడం ఆందోళన కలిగించే అంశం. రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కేసులు బయటపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల 384కు చేరింది. విదేశాల నుంచి వచ్చినవారు,వలస కూలీలతో కలిపి మొత్తం కరోనా కేసులు 2 వేల 425కు చేరాయి.

కేసుల వివరాలు ఇలా...

ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన వారిలో... ఇప్పటివరకు 180 మందిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. సౌదీ నుంచి పంపించిన 458 మంది భారతీయుల్లో ఇప్పటివరకూ 207 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల్లో వెయ్యి 381 మంది పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జ్​ అయ్యారు. ఆస్పత్రుల్లో.. 973 మంది చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో... 1528 కేసులు నమోదయ్యాయి. ముప్పుతీవ్రతను అంచనావేసి వైరస్‌ వచ్చిన వారి సన్నిహితులను గుర్తించడంపై పెద్దఎత్తున దృష్టిపెట్టామనీ, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో వ్యక్తిగతదూరం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రజలు సైతం సహకరించాలని సూచిస్తున్నారు.

తగ్గని ఉద్ధృతి

మెదక్‌ జిల్లాలో నాలుగేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తండ్రికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడం గమనార్హం. బాలుడి తండ్రిలో లక్షణాలున్నప్పుడు కుమారుడికి వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చేగుంటకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ రాగా అతడిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ వైరస్‌ బారినపడ్డాడు. మూడురోజుల కిందట గాంధీ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం మృతిచెందాడు. మృతుడి బంధువుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా నేలకొండపల్లికి చెందిన మరో వ్యక్తికి వైరస్‌ ఉన్నట్లు తేలింది.

ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details