Telangana Corona Cases: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గతేడాది చివరిసారిగా జూన్ 26న వెయ్యికి పైగా కొవిడ్ కేసులు నమోదు కాగా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో గత వారం పది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా 42,991 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయగా అందులో 1,052 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,84,023కి చేరాయి. మరో 240 మంది కోలుకోగా ఇప్పటి వరకు 6,75,132 మంది కోలుకున్నారు. తాజాగా మరో ఇద్దరు మహమ్మారికి బలికాగా కరోనా మరణాల సంఖ్య 4,033కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి.
ఒమిక్రాన్ సైతం...
Telangana Omicron Cases: ఎయిర్ పోర్టులో చేస్తున్న పరీక్షల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా పది మందికి ఒమిక్రాన్ సోకగా వారిలో ఐదుగురు ఎట్ రిస్క్, ఐదుగురు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిగా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు 94 మంది ఒమిక్రాన్ బారినపడగా... వారిలో ఇప్పటికే 37 మంది కోలుకున్నట్టు ప్రకటించింది.
ఒక్కసారిగా పెరుగుదల...
Ghmc Covid News: గత వారంరోజులుగా పెరుగుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. వారం రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజుకి కేవలం వంద నుంచి 120 కేసులు నమోదయ్యేవి. కానీ గడిచిన 24 గంటల్లో ఏకంగా 659 మందికి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక మేడ్చల్‌లోనూ వారం రోజుల క్రితం రోజుకి 30కి మించి వైరస్ కేసులు రాలేదు. తాజాగా 116 మంది మహమ్మారి బారినపడ్డారు. రంగారెడ్డిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు రోజుకు 30కేసులు దాటలేదు. మంగళవారం ఒక్కరోజే 109 మంది కొవిడ్ బారిన పడినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
జిల్లాల్లోనూ...
మంగళవారం భూపాలపల్లి, అసిఫాబాద్, ములుగు, నిర్మల్ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండల్లోనూ అంతకంతకూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాఠిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది.
ఇప్పటికే కరోనా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ కోరుతోంది.
ఇవీ చూడండి: