తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రాలో సీఐడీ వాట్సప్​కు 9 రోజుల్లో 10,068 ఫిర్యాదులు - ఏపీ సీఐడీ వార్తలు

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, అసత్య ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏపీ సీఐడీ ప్రారంభించిన ఫ్యాక్ట్ చెక్ వాట్సప్ నంబర్​కు విశేష స్పందన లభిస్తోంది. దీనికి రోజుకు సగటున వెయ్యి వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆ రాష్ట్ర సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్​కుమార్ చెప్పారు.

10068-complaints-in-9-days-to-ap-cid-fact-check-whatsapp-number
ఆంధ్రాలో సీఐడీ వాట్సప్​కు 9 రోజుల్లో 10,068 ఫిర్యాదులు

By

Published : Apr 25, 2020, 6:49 AM IST

కరోనా వైరస్ కలవరపెడుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం వెల్లువెత్తుతోంది. వివిధ రూపాల్లో తమకొస్తున్న సందేశాల్లోని సారాంశం నిజమా? కాదా? అనేది నిర్ధారించుకోకుండానే చాలామంది వాటిని వేర్వేరు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కొంతమందైతే సామాజిక మాధ్యమ వేదికలపై అసభ్యకర వ్యాఖ్యలతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారు.

ఏపీ సీఐడీ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఫ్యాక్ట్ చెక్ వాట్సప్' నంబర్​కు ఇలాంటి వాటిపై గత తొమ్మిది రోజుల్లో 10,068 ఫిర్యాదులు అందాయి. రోజుకు సగటున వెయ్యి వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ఏపీ సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్​కుమార్ చెప్పారు. 15 మందితో కూడిన బృందం వీటిని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. వాట్సప్​లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత ఫిర్యాదుదారుకు ఒక రిఫరెన్స్ సంఖ్యను పంపిస్తారు. దాని ఆధారంగా ఆ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వాటిపైనే ఫిర్యాదులు ఎక్కువ

లాక్​డౌన్​తో చాలా మంది ఖాళీగా ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో తమకు గిట్టని వారిని కించపరిచేలా పోస్టులు పెట్టటం, అసభ్యకర వ్యాఖ్యలు చేయటం, వేధించటం వంటివి చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని ఉంచుతున్నారు. సీఐడీ వాట్సప్​ నంబర్​కు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం ఇలాంటివే.

కొందరు గతంలో జరిగిన ఘటనలకు చెందిన చిత్రాలు, వీడియోలు జోడించి అవి కరోనాకు సంబంధించినవేనని పేర్కొంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరికొందరు తమను కించపరిచేలా పెట్టిన పోస్టులను తొలగించేలా చూడాలని విన్నవిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అసత్య, అసభ్యకర వ్యాఖ్యలతో వేధించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవికత నిర్ధారణ కోసం 9071666667కు వాట్సప్ చేయవచ్చని సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్ తెలిపారు.

ఆంధ్రాలో సీఐడీ వాట్సప్​కు 9 రోజుల్లో 10,068 ఫిర్యాదులు

ఇదీ చదవండిఏపీ సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం..!

ABOUT THE AUTHOR

...view details