గ్రేటర్ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. వెంటనే వైరస్ లక్షణాలు బయటపడకపోవడం కానీ, బయటపడినా భౌతిక దూరం పాటించకపోవడం కానీ, జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల కానీ ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా 26 కేసులు బయటపడడమే ఈ పరిస్థితికి నిదర్శనం. లాక్‌డౌన్ నిబంధనలను మంగళవారం నుంచి మరింత సడలించడంతో ప్రజలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్‌లు ధరించడం...చేతి శుభ్రత పాటించపోతే వైరస్ ఉద్ధృతి మరింత పెరిగే ప్రమాదముంది.
కొవిడ్‌తో బ్యాంకు ఉద్యోగి కన్నుమూత
సుల్తాన్‌బజార్: కోఠిలోని ఓ బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్ విభాగంలో పని చేసే ఉద్యోగి కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గత నెలలో ఆయన బావమరిది కుమారుడు గుండెపోటుతో చనిపోవడంతో జియాగూడకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈనెల 14న ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. కామ్‌గార్‌నగర్‌లోని ఉద్యోగి కుటుంబ సభ్యులు 8 మందిని, అతను పనిచేసే బ్యాంకు శాఖ సిబ్బంది, ఇతరులు కలిపి 74 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. బ్యాంకు మొత్తాన్ని శానిటైజేషన్ చేయించారు.
మంగళ్‌హాట్‌లో మరో ఇద్దరికి
గోషామహల్: మంగళ్‌హాట్‌లో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. శివలాల్‌నగర్‌లో 2 రోజుల క్రితం ఓ వృద్ధురాలికి కరోనా రావడంతో కుటుంబ సభ్యులను ఎర్రగడ్డలోని ప్రభుత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. భోలక్‌పూర్‌లో గర్భిణికి సోకడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది, సోమవారం ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు 70 మందిని హోం క్వారంటైన్ చేశారు. శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన వ్యక్తి(29)కి వైరస్ సోకింది.