3 నెలల్లో పూర్తి... ఇప్పటికే 1034 బస్టాపుల్లో షెల్టర్లు ఉండగా.. ఇంకా 802 చోట్ల నిర్మించాలని జీహెచ్‌ఎంసీని ఆర్టీసీ కోరింది. సంయుక్త సర్వేను నిర్వహించి షెల్టర్ల నిర్మాణం అవసరమున్న ప్రాంతాలను గుర్తించారు. ఈ స్టాపుల్లోనూ షెల్టర్లు వస్తే... పూర్తిస్థాయిలో డిజిటల్ బోర్డులు పెట్టి... వాటికి బస్సులను అనుసంధానిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ చెప్పారు. ఈ పనిని మూడు నెలల్లో పూర్తి చేసి... నగర ప్రయాణికులకు మెట్రో, ఎంఎంటీఎస్ మాదిరే ఆర్టీసీ బస్సుల సమాచారం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
బస్టాపులో సమాచారం
రాత్రి 10 గంటలు దాటితే బస్సులు ఉండటం లేదని ప్రయాణికులు అంటుంటే... 20 శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పూట స్టాపుల్లో వేచి ఉండే ప్రయాణికులకు బస్సు.. ఉందా.. లేదా అనే సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఏ స్టాపులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు.. ఏ సమయంలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారనే సమాచారం ఆర్టీసీ దగ్గర ఉంటుంది. అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడం.. తగ్గించడం.. అర్ధరాత్రి వరకూ అవసరమైన మార్గాల్లో నడపడానికి అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.