తెలంగాణ రాష్ట్రంలో తెరాస పతనం మొదలైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఆధిక్యాలు బాగా పడిపోవడమే తెరాస పతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రేవంత్ ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల్లో తెరాస తిరస్కరణకు గురైందని చెప్పడానికి... లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమని.... ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలలో తెరాస ఘోరంగా ఓడిపోయిందని విమర్శించారు. అప్పట్లో కేసీఆర్ కన్నీరుమున్నీరుగా ఏడ్చి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కొన్ని నెలల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదని లేఖలో ప్రస్తావించారు.