తొలకరి జల్లు పలకరిస్తున్న వేళ ఏరువాక కోసం రైతన్నకు భరోసానిచ్చేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద రూ. 6వేల 900 కోట్లు విడుదల చేసింది. వీటిని మంగళవారం నుంచే రైతు ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎకరానికి ఐదువేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. గతేడాది నాలుగువేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని ప్రస్తుతం రూ. ఐదు వేలకు పెంచారు. మొత్తం కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి సరిపోక ఇంకా రైతులు మిగిలితే వారికి ఇచ్చేందుకు కూడా సముఖంగానే ఉంది.
రెవెన్యూ శాఖ ఇప్పటికే 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించింది. వీరితో పాటు ఇంకా మిగిలిన వారికి ఇచ్చేందుకు ధరణి పోర్టల్లో తాహసీల్దార్లు డిజిటల్ సంతకం చేశారు. ఇలా సంతకాలు పూర్తైన రైతులకు సైతం రైతు బంధు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వీరే కాకుండా అటవీ భూమి యాజమాన్య హక్కు కలిగిన వారి ఖాతాల్లోనూ వేయనున్నారు.
దశల వారీగా ఖాతాల్లోకి...
నగదు పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా గతేడాదిలాగే ఈసారి కూడా నగదును దశల వారీగా రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. నెలాకరులోగా అందరి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.