శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. నలుగురు తెరాస... ఒక ఎంఐఎం అభ్యర్థి విజయం లాంఛనమే అయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి బరిలో ఉన్నప్పటికి ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. తెదేపా, భాజపా కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఎన్నికలకు దూరంగా...
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తెరాస ఎమ్మెల్యేందరూ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఐదు విడుతలుగా వెళ్లి ఓటు వేశారు. ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పిదాలు చేయకుండా నిన్న, నేడు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించి పలు జాగ్రత్తలు తీసుకుంది తెరాస.
ఆ ఐదుగురు...
తెరాస నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం అభ్యర్థులు కాగా ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ హసన్, కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. బరి నుంచి హస్తం తప్పుకున్నందునతెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనప్రాయమే అయింది.
పక్కా వ్యూహంతో...
తెలంగాణ రాష్ట్ర సమితికి నామినేటెడ్ శాసనసభ్యుడితో కలిపి 91... ఎంఐఎం శాసనసభ్యులు ఏడుగురు.. మొత్తం 98 మంది ఉన్నారు.తెదేపా శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటింగులో పాల్గోవద్దని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినందున... కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు సభ్యుల అవసరం లేకుండానే గెలవాలని తెరాస వ్యూహం రూపొందించింది. పోలింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు నిన్న వివరించారు. చెల్లని ఓట్ల సమస్య తలెత్తకుండా నమూనా పోలింగ్ కూడా నిర్వహించారు. ముగ్గురు అభ్యర్థులకు 20 మంది ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు అభ్యర్థులకు 19మంది ఎమ్మెల్యేల చొప్పున ఓట్లు వేయాలని నిర్ణయించారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర సమితి.
ఇవీ చూడండి:'16 స్థానాల్లో తెరాస జెండా ఎగురవేస్తాం'