సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉపఎన్నికలపై తెరాస కన్నేసింది. ఎలాగైనా ఆ మూడు స్థానాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం పావులు కదుపుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ కానున్నారు. నామపత్రాల సమర్పణకు ఈ నెల 14 వరకే గడువు ఉన్నందున ఈ రెండ్రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.
రేసుగుర్రాలెవరో?
ఉపఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో రంగారెడ్డి మినహా రెండు జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేటీఆర్కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత హామీ మేరకు తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా ఆశిస్తున్నప్పటికీ... మహబూబాబాద్ నుంచి ఇప్పటికే సత్యవతి రాఠోడ్కు ఎమ్మెల్సీ ఇచ్చినందున ఈసారి ఆయన రేసులో లేనట్టేనని భావిస్తున్నారు.