'సెల్ఫీ'తో ముప్పే!
ఇప్పుడంతా సెల్ఫీలదే ట్రెండ్. నిమిషానికో సెల్ఫీ తీశామా.. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశామా అనే ఆలోచిస్తోంది నేటి యువత. చేసే ప్రతి పనిని, కనిపించే ప్రతిదానితో స్వీయ చిత్రం తీసుకోవడం అలవాటైపోయింది. ఈ సెల్ఫీలతో ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు.. నిపుణులు.
తరచూ సెల్ఫీలు తీసుకునే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందట. ఈ విషయాన్ని ప్రముఖ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ డా.దేబరాజ్ షోమె తెలిపారు. సాధారణ ఫొటోల కంటే సెల్ఫీలతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. స్వీయ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి అనుకున్న లైక్లు రాకపోతే చాలామంది ఆత్మన్యూనతకు గురవుతున్నారని చెప్పారు. అందంపై శ్రద్ధ పెరగడం.. కాస్మోటిక్ సర్జరీలకు దారి తీస్తోందని ఆవేదన చెందారు. యువతలో ఈ విషయంపై అవగాహన కల్పించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారని ఆయన వివరించారు.