తెలంగాణ

telangana

ETV Bharat / state

'అసెంబ్లీ నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి' - assembly

ప్రస్తుత అసెంబ్లీ, శాసన మండలి భవనాల్లో సరైన వసతులు లేవని... సురక్షితం కావని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నూతన శాసనసభ సముదాయం నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవద్దంటూ కోరింది.

నూతన చట్టసభల నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి

By

Published : Jul 10, 2019, 4:57 AM IST

Updated : Jul 10, 2019, 7:22 AM IST

అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. నిజాం కాలంలో నిర్మించిన శాసనసభ, శాసన మండలి భవనాలు సురక్షితంగా లేవని ప్రభుత్వం పేర్కొంది. రోడ్లు భవనాల శాఖ 2017లో శాసనమండలి భవనాన్ని పరిశీలించి.... అగ్నిమాపక వ్యవస్థ సరిగ్గా లేదని నివేదిక ఇచ్చినట్లు పేర్కొంది. అసెంబ్లీ భవనానికి కూడా కొంతకాలంగా మరమ్మతులు జరగుతూనే ఉన్నాయని తెలిపింది.

అరకొర వసతులు

శాసనసభలో స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, మంత్రులకు సరైన సదుపాయాలు లేనట్లు వివరించింది. శాసనమండలిలో మంత్రులు, అధికారులకు సరిపోయే గ్యాలరీలు లేవని తెలిపింది. ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సెంట్రల్ హాలు, గ్రంథాలయం, వీడియో కాన్ఫరెన్స్ హాలు లేవని పేర్కొంది. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా చట్టసభల సముదాయం నిర్మించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా నిర్ణయించిందని హైకోర్టులో దాఖలు చేసిన కౌంటరులో రోడ్లు భవనాల శాఖ పేర్కొంది.

అవి చారిత్రక కట్టడాలు కావు

ఇర్రమంజిల్ భవనాలు చారిత్రక కట్టడాలు కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిని కూల్చివేసేందుకు చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ అనుమతులు అవసరం లేదని తెలిపింది. ప్రమాదకరంగా మారినందున చారిత్రక కట్టడాల నిబంధనను తొలగిస్తూ 2015లో జీవో జారీ అయిందని తెలిపింది.

ప్రజాప్రయోజనం లేదు

అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఆచార్య పీఎల్ విశ్వేశ్వరరావు, ఓఎం దేబరా, జె.శంకర్, లుబ్నా సార్వత్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ప్రజాప్రయోజనం లేదని.. అవి రాజకీయ ప్రేరేపితాలని ప్రభుత్వం ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన ఆ వ్యాజ్యాలను ప్రోత్సహించవద్దని.. వాటిని కొట్టివేయాలని హైకోర్టును కోరింది. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే నూతన సముదాయాల నిర్మాణం తలపెట్టినట్లు... ఈ నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని సర్కారు తెలిపింది.

నూతన చట్టసభల నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి

ఇదీ చూడండి: కత్తితో గొంతుకోసిన ప్రేమోన్మాది...

Last Updated : Jul 10, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details