తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న లోక్​సభ స్థానాలివే !

లోక్​సభ ఎన్నికల్ని ​ఓ సవాల్​గా తీసుకున్న కాంగ్రెస్... అసెంబ్లీ ఫలితాల నష్టాన్ని పూడ్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా బలమున్న నియోజకవర్గాల్లో సీనియర్లను పోటీకి దింపింది. అభ్యర్థుల ఎంపికకు సుదీర్ఘ కసరత్తు చేసి... అధికార పార్టీని ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

బలమున్న చోట బరిలో దిగిన కాంగ్రెస్

By

Published : Apr 2, 2019, 6:54 PM IST

Updated : Apr 4, 2019, 1:49 PM IST

బలమున్న చోట బరిలో దిగిన కాంగ్రెస్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్... పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని స్థానాల్లోనైనా గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల దాకా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 2014 సార్వత్రిక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు, స్థానిక అంశాలు ప్రాతిపదికన పోటీకి సిద్ధమైంది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబాబాద్​, ఖమ్మం స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిజామాబాద్, కరీంనగర్​నూ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మల్కాజిగిరిలో తెలుగుదేశం తరఫున గెలిచిన మల్లారెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ సైకిల్ పార్టీకి పటిష్ఠ క్యాడర్ ఉంది. వివిధ రాష్ట్రాల ప్రజలు, 80 శాతం అక్షరాస్యులే ఉండటం కలిసొస్తాయని విశ్వసిస్తున్నారు. తెదేపాతో ఉన్న సంబంధాల దృష్ట్యా... అధికార పార్టీని ఢీకొట్టేందుకు సమర్థవంతమైన అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని బరిలో దించింది.

భువనగిరి అభ్యర్థిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డిని ఎంపిక చేసింది. నియోజకవర్గ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోగా... మిగతా చోట్ల కూడా పార్టీకి బలమైన క్యాడర్, కోమటిరెడ్డికి వ్యక్తిగత అనుచరవర్గం ఉంది. గతంలో ఇక్కడి నుంచి వెంకట్​రెడ్డి సోదరుడు రాజగోపాల్​ రెడ్డి లోక్​సభకు ప్రాతినిధ్యం వహించారు.

నల్గొండలో పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్, స్థానిక శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డిని బరిలో దింపింది. 2014లో పార్టీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించి తెరాసలో చేరారు. కోదాడ, హుజూర్​నగర్​, నాగార్జున సాగర్, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్​కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.

ఖమ్మం జిల్లాలోప్రజాకూటమి అభ్యర్థులు విజయం సాధించి సత్తా చాటారు. ఖమ్మం పార్లమెంటు నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోటీకి నిలిపింది. కాంగ్రెస్​ క్యాడర్​కు తెదేపా అదనపు బలం అవుతుందని భావిస్తున్నారు. అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు కలిసొస్తాయని ఆశిస్తున్నారు.

మహబూబాబాద్ నుంచి మరో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. ప్రత్యర్థి కంటే బలమైన నాయకుడిగా పేరుంది. రేణుకా, బలరాం నాయక్​ విజయం ఖాయమని అధిష్ఠానం అంచనా వేస్తోంది.

చేవెళ్లలో తెరాస తరఫున గెలిచి కాంగ్రెస్​లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. తాండూర్, మహేశ్వరం స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం, వ్యక్తిగతంగా పట్టుండడం కొండాకు అదనపు బలం.

మరో రెండు చోట్ల...

ఆరు స్థానాలపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం నిజామాబాద్, కరీంనగర్​పైనా కన్నేసింది. గతంలో నిజామాబాద్​ నుంచి గెలిచిన మధుయాస్కీని రంగంలోకి దింపింది. బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ... ప్రభుత్వంపై రైతుల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని పసుపు బోర్డు, గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇస్తోంది. గతంలో కరీంనగర్​ ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి గెలుపునకు దోహదం చేస్తాయని భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రణాళికతో... రాష్ట్రంలో కనీసం ఎనిమిది ఎంపీలైనా గెలవాలని కాంగ్రెస్ లక్ష్యం నిర్దేశించుకుంది.

ఇవీ చూడండి:తెరాసకు ప్రత్యామ్నాయం దిశగా కమలం అడుగులు..!

Last Updated : Apr 4, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details