స్థానిక ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్న హస్తం పార్టీ... స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను మండల అధ్యక్షులకు అప్పగించింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక, వ్యూహరచనకు ముఖ్య నాయకులతో నేడు సమావేశం ఏర్పాటు చేశారు.
నేడు ప్రత్యేక సమావేశం
ఈ నెల 20లోపు ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉన్నందున హస్తం పార్టీ అప్రమత్తమైంది. డీసీసీ అధ్యక్షులతో సంప్రదించి జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తోంది. 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించి ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆర్సీ కుంతియా, ఉత్తమ్, భట్టి, కార్యనిర్వాహక అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, సమన్వయకర్తలు పాల్గొననున్నారు.