తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రావతరణ వేడుకలు ఇకనుంచి అక్కడే! - jubleehall

జాతీయ, రాష్ట్ర వేడుకలు ఇక నుంచి పబ్లిక్ గార్డెన్స్ వేదికగా జరగనున్నాయి. తెలంగాణ అవతరణ వేడుకల నుంచే... పోలీసుల, విద్యార్థుల కవాతు లేకుండా భిన్నంగా నిర్వహించేందుకు దాదాపుగా ఖాయమైంది. ప్రసంగాలతోనే సరిపెట్టకుండా... వివిధ కార్యాక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రావతరణ వేడుకలు ఇకనుంచి అక్కడే!

By

Published : May 18, 2019, 4:57 AM IST

Updated : May 18, 2019, 8:05 AM IST


స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా నిర్వహించేవారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు మాత్రం ఎన్టీఆర్ మైదానంలో జరిపేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు గోల్కొండ కోటలో మిగతా వేడుకలు పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్, జూబ్లీహాల్​లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇక కవాతుకు స్వస్తి!

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో... ఉత్సవాలు ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అన్న విషయంపై చర్చించారు. పోలీసు, విద్యార్థులచే ఎండలో కవాతు నిర్వహించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయంపై కూడా చర్చ జరిగింది. చాలా రాష్ట్రాలు కవాతుకు స్వస్తి పలికినందున ఇక్కడ కూడా అనుసరిస్తే సముచితంగా ఉంటుందని పలువు అధికారులు అభిప్రాయపడ్డారు.

పతాకావిష్కరణ, ప్రసంగాలే కాదు...

పతాకావిష్కరణ, ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని పలువురు సూచించారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల నిర్వహణకు అనుకూలంగా లేనందున... చారిత్రక ప్రాధాన్యం గల పబ్లిక్ గార్డెన్, జూబ్లీహాల్​లో నిర్వహిస్తే బాగుంటుందన్న సీపీ అంజనీ కుమార్ ప్రతిపాదనతో అందరూ ఏకీభవించారు. ఇకనుంచి అన్ని ఉత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా... వైభవంగా నిర్వహించేలా ఉన్నతాధికారులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సీఎస్ జోషీని ఆదేశించారు.

పదిన్నరకే ముగించాలి

రాష్ట్రావతరణ వేడుకల షెడ్యూలు కూడా ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి పదిన్నర వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ముఖ్యమంత్రి సందేశం, పదిన్నరకు సీఎస్ ఆధ్వర్యంలో ఎట్ హోం, 11 గంటలకు జూబ్లీహాలులో రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం, సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. ఈ వేడుకలకు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు.

రాష్ట్రావతరణ వేడుకలు ఇకనుంచి అక్కడే!

ఇవీ చూడండి: రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Last Updated : May 18, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details