ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీపై అభియోగపత్రం ఎంసెట్-2016 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత తెలంగాణ సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్నందున భవిష్యత్తులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని పేర్కొంది. దాదాపు 3,500లకు పైగా పేజీలున్న ఈ అభియోగపత్రంలో ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు 350 మంది సాక్షులున్నట్లు తెలిపింది. మొత్తం 93 మంది నిందితుల్లో దర్యాప్తు సమయంలో ముగ్గురు మరణించారని, మరో ముగ్గురు ముందస్తు బెయిల్ పొందినట్లు పేర్కొంది. 66 మందిని అరెస్ట్ చేయగా.. 21 మంది పరారీలో ఉన్నారని వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చినట్లు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సీఐడీని ఆశ్రయించారు. వారి ఫిర్యాదుపై అధికారులు 2016 జులై 25న కేసు నమోదు చేశారు. మొదట్లో సాధారణ కేసుగానే పోలీసులు పరిగణించినా.. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రం ముందుగానే లీకైందని.. దిల్లీ కేంద్రంగా ఈ కుట్ర జరిగిందని సీఐడీ తేల్చింది.
అసలేం జరిగింది..
ప్రశ్నపత్రాలు లీక్ చేయడంలో ఆరితేరిన బిహార్‌కు చెందిన శివ బహదూర్‌సింగ్ తన మనుషుల ద్వారా దిల్లీలో ముద్రించిన ఎంసెట్ ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించాడు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తులను నియమించుకుని వారి ద్వారా విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. పరీక్షకు కొద్ది రోజుల ముందు విద్యార్థులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి తన దగ్గరున్న ప్రశ్నపత్రం ద్వారా విద్యార్థులకు తర్ఫీదు ఇప్పించాడు. పరీక్ష రోజున సరాసరి వారిని కేంద్రాలకు తరలించాడు. చదువుల్లో ఏమాత్రం ప్రతిభలేని విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడంపై కొందరు తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలంటూ సీఐడీని ఆశ్రయించారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో బండారం బయటపడింది. ఈ మొత్తం వ్యవహారం వివిధ దశల్లో జరగడం వల్ల దర్యాప్తులో ఆటంకాలు ఎదురయ్యాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆధారాల సేకరణ కష్టమైంది. దర్యాప్తు జరుగుతుండగానే ముగ్గురు నిందితులు అనారోగ్య కారణాలతో మరణించారు. ప్రధాన నిందితులంతా బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడం వల్ల వారిని గుర్తించి అరెస్టు చేయడానికి చాలా సమయం పట్టింది. దర్యాప్తు చేస్తున్న పలువురు అధికారులు నిందితులతో కుమ్మక్కయినట్లు ఆరోపణలు రావడంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వందలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఈ కేసులో ఏళ్లు గడుస్తున్నా.. అభియోగపత్రం దాఖలు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సీఐడీ ఎస్పీ పరిమళ నూతన్.. న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.
ఇవీ చూడండి: అమల్లోకొచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం