సార్వత్రిక పోరులో కనిపించని కమలదళం లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటిన కలమం పార్టీ... పరిషత్ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు పొంది ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం ఉంటుందని... అద్భుత ఫలితాలొస్తాయని భావించింది. తీరా ఫలితాల్లో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 211 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. తొమ్మిది జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాల్లో ఖాతా కూడా తెరవలేదు. ఇక 16 జిల్లాల్లో ఒకే అంకె స్థానానికే పరిమితమైంది భాజపా.
లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో కూడా కమల దళం చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవలేకపోయింది.
538 జడ్పీటీసీ స్థానాలకు గాను భాజపా 453 , 5,817 ఎంపీటీసీ స్థానాలకు గాను 3,023 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆదిలాబాద్-5, నిజామాబాద్-2, నారాయణపేట ఒకటి చొప్పున 8 జడ్పీటీసీ స్థానాల్లో భాజపా గెలుపొందింది. ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీ గెలిచిన స్థానాలు 4 శాతంలోపే ఉండడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు పూర్తి భిన్నమైనవి కావడం వల్ల ఆశించిన ఫలితాలు భాజపాకు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికలు జరిపి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం