జగాలను ఏలిన జగదేకవీరుడికి.... జగన్మాత సీతమ్మకు జరిగే కల్యాణం విశ్వ కల్యాణంగా భావిస్తారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం సీతారాముల వారి కల్యాణశోభతోకళకళలాడుతోంది. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా... నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేకవీరుడు రామయ్యకు అతిలోక సుందరి సీతమ్మకు కమనీయమైన పరిణయ వేడుక జరగనుంది. సీతారాముల వారి వివాహా క్రతువుకు రాములోరి సన్నిధి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. తొలుత మూలవరులకు అభిషేకం, ఆ తర్వాత ప్రధాన ఆలయంలో ఏకాంతంగా కల్యాణవేడుక జరగనుంది. తదనంతరం ఉత్సవ మూర్తులకు అలంకార సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య సాగే కల్యాణ ఘట్టం ఆద్యంతం వైభవోపేతంగా సాగనుంది.
అభిజిత్ లఘ్నమున...
బేడా మండపానికి సీతారాములు వారు విచ్చేసిన తర్వాత రామయ్య తండ్రికి పచ్చలహారం, సీతమ్మ తల్లికి చింతాకుపతకం, లక్ష్మణుల స్వామివారికి వారికి రామమాడ సమర్పిస్తారు. అభిజిత్ లఘ్నమున జరిగే సీతారాముల వారి కల్యాణ ఘట్టంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా 12 గంటలకు వేద పండితులు వేదమంత్రాలను పఠిస్తుండగా.....మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ సీతమ్మ తలపై రాములోరు జీలకర్ర బెల్లం పెడతారు. 12.30 గంటలకు మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుక జరుగనుంది.