Godavari Flood Reduced In Bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి నానాటికీ పెరుగుతూ వచ్చి.. సాయంత్రానికి 50.9 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని.. ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
గోదావరి ముంపునకు గురైన గుండాల మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటించారు. ఇటీవల కిన్నెరసాని వరద ముంపునకు గురైన నర్సాపురం, కన్నాయిగూడెం, ముత్తాపురం గ్రామాల పరిధిలోని వరద బాధితులను పరామర్శించారు. వరద ప్రాంతాల సమస్యలను నష్టపోయిన వారి వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని బాధితులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధితులకు మూడు రోజులపాటు భోజన సౌకర్యాలు కల్పించాలని మండల తహసీల్దార్‌ను ఆదేశించారు.
Godavari River Water Level Reduced In Bhadrachalam : అంతకు ముందు గోదావరి వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పోదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు పరిశీలించారు. ముంపు వాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని వీహెచ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. భద్రాచలంలోని జూనియర్ కళాశాలలో పునరావాసం పొందుతున్న వరద బాధితులను ఆయన పరామర్శించారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టను బలోపేతం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పునరావాస కేంద్రాల్లో తలదాల్చుకున్న వారికి సరైన సమయానికి భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు.