ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కొవిడ్-19 నివారణ కార్యక్రమంలో తలమునకలయ్యారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు చాలా వరకు పని చేయడంలేదు. ఈ తరుణంలో నిండు గర్భిణులు సకాలంలో ఆస్పత్రులకు చేరేందుకు ఇబ్బందులు తప్పడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగానే ఆస్పత్రులకు వచ్చి ఉండే అవకాశాలు లేవు. ప్రభుత్వం వారి కోసం 102 వాహనాలను అందుబాటులో ఉంచింది. ఆస్పత్రులకు చేరే సమయంలో ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉన్న ఆరోగ్యశాఖ సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
గర్భిణుల సంరక్షణ ప్రణాళిక ఇలా..
గర్భిణుల గుర్తింపు:
తొలుత క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో గర్భిణులను గుర్తిస్తారు. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఎన్‌ఎం ట్యాబ్‌లో ఆన్‌లైన్ రిజిస్టరు చేస్తారు. కేసీఆర్ కిట్ పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ పథకాల వర్తింపునకు అర్హత కల్పిస్తూ ఎంసీహెచ్(మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కార్డులో పొందుపరిచిన అంశాల ప్రకారం టీకాలు, ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీ చేస్తూ ఇతర ఆరోగ్య సేవలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తారు.
బర్త్‌ప్లాన్ తయారీ:
మూడు, ఆరు, తొమ్మిదో నెలలో పీహెచ్‌సీ వైద్యాధికారి స్వయంగా గర్భిణి ఆరోగ్యాన్ని పరీక్షించి బర్త్‌ప్లాన్ (జనన ప్రణాళిక) తయారు చేస్తారు. కాన్పు జరిగే వరకు గర్భిణుల ఆరోగ్య స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తారు. కాన్పు తేదీ దగ్గర పడనున్న సమయంలో వారిని అప్రమత్తం చేస్తుంటారు.
కాన్పు తేదీ నిర్ధారణ:
ఏడో నెలలో మాత్రం పెద్దాసుపత్రి ప్రసూతి వైద్యులు పరీక్షిస్తారు. ఈ సమయంలో ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాన్పు తేదీని ముందుగానే నిర్దేశించి ఈ వ్యవధిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం తగిన సలహాలు అందిస్తారు. రక్తహీనత, ఎత్తు తక్కువ, వయస్సు పెరిగిన తర్వాత గర్భం దాల్చిన వారిని, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని హైరిస్క్ గర్భిణులుగా గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందిస్తారు. విధిగా వారి ఆరోగ్య స్థితిపై పర్యవేక్షణ ఉంచుతూ ఎలాంటి అనర్థాలు తలెత్తకుండా అప్రమత్తం చేస్తారు.