భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దిబ్బ గూడెంలోని ప్రాథమిక పాఠశాల పచ్చదనానికి నిలయమైంది. బడి ఆవరణలో అడుగుపెట్టగానే అక్కడి మొక్కలకు సెలైన్ సీసాలు కనిపిస్తాయి. కాస్త దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుంది అసలు విషయం. ఎప్పటికప్పుడు మొక్కలకు నీళ్లు అందించేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఇలా ఏర్పాటు చేశారు.
ఆచరణగా మారిన ఆలోచన
పాఠశాలకు ఆవరణలో గల రోడ్డుకు రెండు వైపులా.. హరితహారంలో భాగంగా అధికారులు మొక్కలు నాటించారు. కానీ.. వాటి ఆలనాపాలనా విషయాన్ని మాత్రం గాలికి వదిలేశారు. మొక్కలు ఎండిపోవడాన్ని గమనించిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సెలైన్ సీసాలతో మొక్కలకు చుక్కలు చుక్కలుగా నీళ్లు పడే ఏర్పాటు చేశారు. దీంతో.. మొక్కలు మళ్లీ పచ్చబడ్డాయి. ఉదయం స్కూలుకు వచ్చినప్పుడు ఆ సెలైన్ సీసాల్లో నీళ్లు పోస్తారు. అవి సాయంత్రం దాకా వస్తాయి. మళ్లీ సాయంత్రం ఇంటికి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ నీళ్లు నింపుతారు. ఇలా ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నీళ్లు పోయడంతో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. పాఠశాల ఆవకణ అంతా పచ్చదనం పరుచుకుంది.