తెలంగాణ

telangana

ETV Bharat / state

మణుగూరు వైద్యనాథ్​ ఆలయం... నవగ్రహాల ప్రత్యేకం... - రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు

ఏ ఆలయంలోనైనా నవగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠిస్తారు. కానీ భద్రాద్రి జిల్లా మణుగూరులోని వైద్యనాథ్​ లింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఒక్కో గ్రహానికి ఒక్కో ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఇవి సతీ సమేతంగా ఉండడం మరో విశేషం. ఆలయం చుట్టూ 108 శివ లింగాలు ప్రతిష్ఠించి... 108 మారేడు మొక్కలు నాటారు. దీని వల్ల భక్తులు ఒకసారి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తే 108 శివలింగాల ప్రదక్షిణ చేసినట్లు భావిస్తూ... తన్మయత్వం పొందుతారు. గోదావరి తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న మణుగూరు శివాలయంపై ఈటీవీభారత్​ ప్రత్యేక కథనం...

మణుగూరు శివాలయం

By

Published : Aug 6, 2019, 11:37 PM IST

మణుగూరు వైద్యనాథ్​ ఆలయం... నవగ్రహాల ప్రత్యేకం...

దేశంలోని ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు లేని ప్రత్యేకత భద్రాద్రి జిల్లాలోని భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర మహా శైవ క్షేత్రానికి ఉంది. మణుగూరు మండల పరిధిలోని కొండయి గూడెం, రామానుజవరం గ్రామాల సరిహద్దుల్లో గోదావరి నది ఒడ్డున ఉన్న శైవ క్షేత్రంలో నవగ్రహాలు సతీ సమేతంగా ప్రతిష్ఠించారు. 35 అడుగుల అభయాంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడిగా దర్శనమిస్తాడు. ప్రశాంత వాతావరణంలో గోదావరీ తీరాన నవగ్రహాలు సతీ సమేతంగా కొలువైన ఈ శైవ క్షేత్రంలో అడుగిడిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు.

ఆలయ చరిత్ర

భ్రమరాంబ సమేత వైద్య నాగలింగేశ్వర శివ క్షేత్రాన్ని 2009లో ప్రతిష్ఠించారు. ఆలయానికి ఉత్తరం వైపున గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ ఆలయం పక్కనే వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఏటా మహా శివరాత్రికి స్వామివారికి కల్యాణం, ఉత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి. దాదాపు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వైద్యనాథ లింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని... గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ద్వారా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారు. నవగ్రహాలకు వేరు వేరుగా ఆలయాలున్న ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details