తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా శ్రీరామ పుష్కర పట్టాభిషేకం.. రాజాధిరాజును చూసి ముగ్ధులైన భక్తజనం - Sitaram Kalyana mahotsava

Sri Sitarama Pushkara Pattabhishekam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవంతో పులకించింది. పన్నేండు ఏళ్లకోసారి నిర్వహించే ఈ క్రతువు ఆద్యంతం అట్టహాసంగా సాగింది. అనుకున్న సమయానికంటే అరగంట ముందే ఆరంభించినప్పటికీ గంటన్నర ఆలస్యంగా ముగించినప్పటికీ భక్తజనం శ్రీరామ నామాలు పఠిస్తూ ఉత్సవాన్ని కనులారా వీక్షించి తన్మయులయ్యారు.

Pattabhishekam
Pattabhishekam

By

Published : Mar 31, 2023, 10:33 PM IST

వైభవంగా శ్రీరామ పుష్కర పట్టాభిషేకం.. రాజాధిరాజును చూసి ముగ్ధులైన భక్తజనం

Sri Sitarama Pushkara Pattabhishekam: భద్రాద్రిలో శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి కల్యాణ మూర్తులను ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకొచ్చారు. శ్రీరామ షడక్షరి మంత్రాలను పఠించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా సామూహిక పారాయణం చేశారు. హోమగుండంలో సమిధలు సమర్పించి నిత్యపూర్ణాహుతి చేశారు. అక్కడి నుంచి స్వర్ణ సార్వభౌమ వాహనంపై దేవదేవుడు మిథిలా మండపానికి రావడంతో ఆ ప్రాంతమంతా శ్రీరామనామ స్మరణతో మారుమోగింది.

విష్వక్షేన పూజ, పుణ్యహవాచనం భక్తి భావాలను పంచింది. ప్రతీసారీ వెండి సింహాసనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాములవారు వేంచేస్తుండగా..ఈ సారి స్వర్ణ సింహాసనంపై దేవదేవుడు కొలువయ్యాడు. పుష్కర పట్టాభిషేక విశిష్టతను వైదిక పెద్దలు వివరించారు. రాములవారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. గవర్నర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరాముడి పట్టాభిషేకంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం, దేశమంతా సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

రైలులో వచ్చిన గవర్నర్​: అంతకు ముందు గురువారం రాత్రి సికింద్రాబాద్​ నుంచి మణుగూరు ఎక్స్​ప్రెస్​ రైలు ద్వారా ఇవాళ ఉదయం కొత్తగూడెం గవర్నర్​ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆలయం వద్దకు వచ్చారు. ఆమెకు ఆలయ ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్​ను దర్శించుకుని అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామిని, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వైదిక పెద్దలు గవర్నర్ తమిళిసైని శాలువాతో సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

రామనామం జపిస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది: ఈ కార్యాక్రమానికి అహోబిల రామానుజ జీయర్​ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భక్తులతో రామనామం జపింపచేశారు. శ్రీరామనామాలు పలికితే పాపాలు పోయి పుణ్యం ప్రాపిస్తుందని ప్రవచించారు. ఈ క్రమంలో భక్తులకు పట్టాభిషేకంలోని కొన్ని ఘట్టాలను విశ్లేషించారు. సముద్రం అంటే అంతం లేనిదని.. రాజు పరాక్రమం కూడా అంతులేనిదన్నారు. ఎన్ని నదులు కలిసినా సముద్రం తన ఉనికిని, ఒ‍రవడిని కోల్పోదని ప్రవచించారు. అందుకే సముద్రజలాలను పట్టాభిషేక మహోత్సవంలో ఉపయోగించారని తెలిపారు.

పట్టాభిషేక వేడుకకు హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగించేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. పట్టాభిషేక మహోత్సవాన్ని జిల్లాకలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ వినీత్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డీవో రత్నకల్యాణి, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

భద్రాద్రి రామయ్య సేవలో గవర్నర్​ తమిళిసై

కనుల పండువగా భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం

గుడిలో 35 మంది భక్తులు మృతి.. రామనవమి వేడుకల్లో పెను విషాదం

ABOUT THE AUTHOR

...view details