భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జెకె 5 ఉపరితలం, టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు గనుల్లోనూ రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా వర్షం కారణంగా పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు.
ఓవర్ బర్డన్ పనులు సైతం...
మరోవైపు ఓవర్ బర్డెన్ పనులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని తెలిపారు. పలు గ్రామాల్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. వర్షం ధాటికి ఇల్లందు పట్టణంలోని ఓ ఇంటి ప్రహరి, గోడ సహా ఆశ కార్యకర్తకు చెందిన రెండు గదుల రేకుల ఇల్లు కూలిపోయింది.
కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా...
జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియాలో 9 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగగా... మణుగూరు ఏరియాలో సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.