Employment guarantee scheme funds in Khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధించిన పనిదినాల లక్ష్యం పూర్తి కావస్తున్నా బిల్లులు మాత్రం అందట్లేదు. కొందరికి నెలల తరబడి మరికొందరికి ఏడాదిగా నగదు చేతికందట్లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భద్రాద్రి జిల్లాలో 45 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటికే 45లక్షల 65వేల పనిదినాలు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 81.16 లక్షల పనిదినాలకు గానూ మార్చి 1 నాటికి 53.54 లక్షల రోజులు పని కల్పించారు.
ఉపాధి హామీ కింద చెరువులు, పంట కాల్వల్లో పూడిక తీత, హరితహారం మొక్కలకు పాదులు చేయడం, పల్లె ప్రకృతి వనాలు వంటి అనేక రకాలు పనులు చేపట్టారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 4 లక్షల 86 వేల 199మంది దినసరి కూలీలు పనిచేశారు. అయితే ఆన్‌లైన్ కూలీల వివరాల నమోదులో తలెత్తిన సాంకేతిక కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కూలీల వివరాలు, పనిదినాల నమోదు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉండేది. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అయితే చాలా మంది కూలీల పేర్లు సాఫ్ట్‌వేర్‌లో కనిపించట్లేదు. మరికొందరి బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం నిలిచిపోవటంతో ఖాతాల్లోకి డబ్బులు రావటం లేదు. ఉభయ జిల్లాల్లో కలిపి వేలాది మంది కూలీలకు నెలల తరబడి డబ్బులు అందక సుమారు 3 కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయాయి.