పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతుందని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10 నియోజకవర్గాల్లో మొత్తం 1,29,851 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 87,172 మంది ఉన్నట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42,679 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉండగా... వీరిలో 55 మంది స్వతంత్ర అభ్యర్థులున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.