అన్నం తినండి.. బాగా చదువుకోండి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు గల కళాశాల. ఇక్కడ చదువుకునేందుకు మారుమూల గ్రామాలు, గిరిజన వాడల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరికి హాస్టల్ సదుపాయం దొరకగా... మరికొందరు రోజు వాళ్ల గ్రామాల నుంచి వచ్చిపోతుంటారు. పరీక్షల సమయం దగ్గరపడడం అందులోనూ వేసవికాలం కావడంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకే నీరసపడిపోతున్నారు. సాయంత్రం వరకు ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులు మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
సొంత డబ్బుతో మధ్యాహ్న భోజనం
విషయం గమనించిన అధ్యాపకులు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ సొంత డబ్బుతో ప్రారంభించారు. కొందరు స్థానికులు వీరికి తోడయ్యారు. రోజూ అన్నం, పప్పు, కూర, సాంబారు, మజ్జిగతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు సుమారు రెండు వందల నుంచి 250 మంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు దోహదం
గతంలో విద్యార్థులు భోజన సదుపాయం లేకపోవడంతో ఒక్కపూట మాత్రమే కళాశాలకు వచ్చేవారు. మరికొందరు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఆకలితోనే తరగతుల్లో కూర్చునేవారు. ప్రస్తుతం విద్యార్థులకు సమయం కలిసి వచ్చి... పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు దోహదపడుతోందని అధ్యాపకులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు.
కళాశాలలో కల్పిస్తున్న ఈ సౌకర్యం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:ఓటర్లను ప్రలోభపెడితే చర్యలే: రజత్‌కుమార్