తెలంగాణ

telangana

ETV Bharat / state

'భద్రాచలం అంశంపై.. వచ్చే సమావేశాల్లో చట్ట సవరణ చేయండి'

High Court orders to government on Bhadrachalam issue: భద్రాచలంతోపాటు మరి కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుని.. వాటిని పంచాయతీలుగానే కొనసాగించాలన్న మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court
High Court

By

Published : Dec 20, 2022, 12:39 PM IST

High Court orders to government on Bhadrachalam issue: భద్రాచలంతోపాటు మరి కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుని, వాటిని పంచాయతీలుగానే కొనసాగించాలన్న మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్ట సవరణ జరిగాక ఎలాంటి జాప్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. భద్రాచలం సహా మరో మూడు పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ 2005లో ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ వై.రాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

అనంతరం భద్రాచలానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ ఎస్‌.వీరయ్య 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ మున్సిపాలిటీలుగా మార్చాలనుకున్న గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలని మంత్రి మండలి నిర్ణయించిందన్నారు. దీనికి అనుగుణంగా ఈనెల 16న ప్రభుత్వం జీవో 45 జారీ చేసిందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంను భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌ పంచాయతీలుగా విభజన చేయడంతోపాటు సారపాక, ఐటీసీ, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని రాజంపేట గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగిస్తున్నట్లు జీవో జారీ చేసినట్లు తెలిపారు. వీటిని పంచాయతీలుగా గుర్తించడానికి పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వచ్చే సమావేశాల్లో చట్ట సవరణ జరిపి, ఆపై పంచాయతీల ఎన్నికల నిర్వహణకు చర్య తీసుకోవాలంటూ పిటిషన్లపై విచారణను మూసివేసింది. ఎన్నికల నిర్వహణలో మరీ జాప్యమైతే మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details